రేవంత్‌కు సంచరించే స్వేచ్ఛ

1

ఎమ్మెల్యే రేవంత్‌ బెయిల్‌ షరతులు సడలింపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) :

తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ షరతులను హైకోర్టు సవరించింది. ప్రస్తుతం కేవలం కొడంగల్‌కే పరిమితమైన రేవంత్‌ ఇక హైదరాబాద్‌కు కూడా వచ్చే వీలు కలగచేసింది. దీంతో  ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై ఉన్న  ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు గతంలో రేవంత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సొంత నియోజకవర్గం దాటి బయటకు వెళ్లరాదని షరతు విధించింది. తాను ప్రజాప్రతినిధి అయినందువల్ల తరచూ రాజధాని హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుందని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, త్వరలో తన కుమార్తె వివాహం ఉన్నందున పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని… తదితర కారణాలతో షరతులను సడలించాలని రేవంత్‌రెడ్డి హైకోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం నియోజకవర్గం దాటి వెళ్లరాదన్న  ఆంక్షలను సడలించింది. అయితే ప్రతి సోమవారం ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.రేవంత్‌ హైదరాబాద్‌ తో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.రేవంత్‌ పిటిషన్‌ పై కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన రేవంత్‌ కు బెయిల్‌ ఇచ్చినప్పుడు హైకోర్టు ఆయన తన నియోజకవర్గం అయిన కొడంగల్‌ కే పరిమితం కావాలని కండిషన్‌ పెట్టింది. దాని పై ఇంతకుముందు కూడా అప్పీల్‌ చేసినా షరతులు సడలించలేదు. తాజాగా వేసిన పిటిషన్‌ పై కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి సోమవారం నాడు ఎసిబి ఆఫీస్‌ కు హాజరు కావాలని మాత్రం హైకోర్టు ఆదేశించింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ సడలించవద్దని ఎసిబి న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.