రేవంత్‌ తిరిగి జైలుకు

1

హైదరాబాద్‌,  జూన్‌ 11 (జనంసాక్షి): ఓటుకు కోట్ల కేసులో రెడ్‌ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి తిరిగి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్‌ సమయం ఉన్నా, చర్లపల్లి జైలు నగరానికి దూరంగా ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యల దృష్ట్యా ముందుగానే ఆయన బయల్దేరినట్లు తెలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన నిఘా మధ్య రేవంత్‌ రెడ్డిని జైలుకు తరలించారు. ఉదయం 8.45 గంటలకు తన ఇంటి నుంచి ఎన్‌ కన్వెన్షన్కు చేరుకున్న రేవంత్‌రెడ్డి, అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. గంటన్నర పాటు కుటుంబ సభ్యులతోను మరికొందరు నాయకులతోను గడిపారు.

మరోవైపు రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్థం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణరెడ్డితో వైభవంగా జరిగింది.  మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు లోకేశ్‌, బాలకృష్ణ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాలకు చెందిన టిడిపి నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీల ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పాల్వాయి..బీజేపీ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత దానం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. మంత్రులు శిద్దా రాఘవరావు,అచ్చెన్నాయుడు, సిఎం రమేశ్‌,రామ్మోహన్‌ నాయుడు తదితరులు వచ్చి ఆశీర్వదించారు. నైమిశ నిశ్చితార్థం సందర్భంగా నిర్వహించిన పూజలో రేవంత్‌ దంపతులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి రేవంత్‌ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుటన్నారు.  నిశ్చితార్థ వేడుకల్లో రేవంత్‌ను ఏసీబీ అధికారులు సివిల్‌ డ్రెస్‌లో ఫాలో అవుతున్నారు. ఎన్‌కన్వెన్షన్‌ పరిసరం మొత్తం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది.