రేవంత్‌ బెయిల్‌ తీర్పు మంగళవారానికి వాయిదా

4

హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో  తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయి రేవంత్‌ మంగళవారం వరకు చర్లపల్లి జైలులో ఉందక తప్పనిస్థి ఏర్పడింది. ఇరువర్గాలు తమతమ వాదనలు వినిపంచాయి. బెయిల్‌ ఇవ్వాలని రేవంత్‌ లాయర్లు కోరగా, ఇస్తే అసలు విషయాలు బయటకు రావని అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. ఇప్పటికే 20 రోజులకు పైగా జైలులో ఉన్నందన బెయిల్‌ ఇవ్వాలని  బెయిల్‌ పిటిషన్‌పై రేవంత్‌రెడ్డి తరపున న్యాయవాది సిద్దార్థ లూధ్రా వాదించారు.  ఏసీబీ తరపున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. దాదాపు  గంటకుపైగా  ఇరువైపుల నుంచి న్యాయవాదుల వాడివేడి వాదనల అనంతరం జడ్జీ తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. జూన్‌ 30న రేవంత్‌ బియిలుపై తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇతర నిందితులను విచారించే అవసరం ఉన్నందున నిందితుడికి ఇప్పుడు బెయిల్‌ ఇవ్వవద్దని ఏజీ కోరారు.రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్థ లూధ్రా వాదిస్తూ… రేవంత్‌రెడ్డిని ఇప్పటికే విచారించి సమాచారం రాబట్టినందున ఆయన్ని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఏసీబీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలాలను తీసుకుందని.. మొత్తం 17 మంది నుంచి ఏసీబీ వాంగ్మూలను నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. రేవంత్‌రెడ్డి సహా ముగ్గురిని ఏసీబీ ప్రశ్నించిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించిందని పేర్కొన్నారు. ఏసీబీ తరపు న్యాయవాది ఏజీ రామకృష్ణారెడ్డి వాదిస్తూ.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రావాల్సి ఉన్నందున రేవంత్‌రెడ్డికి ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు ఇచ్చేందుకు సమకూరిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?… మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం వచ్చేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక ఎమ్మెల్యే అని పక్క రాష్ట్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉందని.. ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు ముగియనగానే ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి తన వాదనలు ప్రారంభించారు. రేవంత్‌కు బెయిల్‌ ఎందుకు ఇవ్వకూడదు… ఇస్తే ఇన్వెస్టిగేషన్‌ను ఏ విధంగా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయన్నదానివిూద రామకృష్ణారెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో రేవంత్‌కు బెయిల్‌ ఇస్తే.. విచారణకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని, మిగిలిన రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. రేవంత్‌రెడ్డికి బెయిల్‌ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్థ లూధ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. నిందితుడు ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నందున దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని… ఆయన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరినట్లు రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది విూడియాకు తెలిపారు.అసలు రేవంత్‌కు బెయిల్‌ ఎందుకు ఇవ్వాలని న్యాయమూర్తే ప్రశ్నించారు. దానికి సమాధానంగా రేవంత్‌ ఏసీబీ కస్టడి ముగియగానే తిరిగి జైలుకు వెళ్లారు. తర్వాత ఆయన కుమార్తె నిశ్చితార్థం కోసం కోర్టు 12 గంటలు బెయిల్‌ ఇచ్చిందని, సాయంత్రం ఆరుగంటల వరకు సమయం ఉన్నా ఒక గంట ముందుగానే రేవంత్‌ తిరిగి జైలుకు వెళ్లారని, అంటే బెయిల్‌ షరతులను అమలు చేయడంలో అతను ఏ విధంగా ఉంటాడన్న విషయాన్ని ఒక ఉదాహరణకు రేవంత్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. రేవంత్‌రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారని, కస్టడీలో చెప్పవలసిన విషయాలను చెప్పారని… ఇంకా ఆయన చెప్పాల్సింది ఏవిూ లేదని… కోర్టు విధించిన షరతులను పాటిస్తారని, అందుచేత రేవంత్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏసీబీ అధికారులు అతని బెయిల్‌ను అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని, మరికొంతమందిని విచారించాలని, నోటీసులు ఇవ్వాల్సి ఉందని, రేవంత్‌కు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెబుతన్నారని, వాటికి రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, పూర్తి స్థాయి విచారణకు సహకరిస్తారని, బెయిల్‌కు ఎలాంటి షరతలు విధించినా అంగీకరిస్తామని రేవంత్‌ తరఫు న్యాయవాది సిద్దార్థ రోహిత్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌ సమావేశమైనట్లు రికార్డయిన దృశ్యాలకు సంబంధించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) అందించిన ప్రాథమిక నివేదికను కోర్టు పరిశీలించింది.కాగా, ఈ నివేదిక తమకు కావాలని తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి అనుమతి లేఖ తీసుకువస్తే నివేదిక ఇస్తామని కోర్టు వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, రేవంత్‌ అరెస్ట్‌కు ముందు తెలంగాణ ఏసీబీ చిత్రీకరించిన ఆడియో, వీడియో టేపులు, కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన వ్యవహారం కావడం వల్ల వాటిని తాము కూడా పరిశీలించాల్సి ఉందని తన మెమోలో తెలిపింది.

కేసులో కొత్త మలుపు

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది.తాజాగా ఫోరెన్సిక్‌ లాబ్‌ అదికారులు తమ అనుమతి లేకుండా ఎవరికి తమ నివేదిక ఇవ్వరాదని కోర్టును ఎసిబి కోరడం విశేషం. ఈ కేసులో ఆడియో,వీడియో టేపుల పరిశీలన నిమిత్తం కోర్టు ద్వారా ఎసిబి వాటిని పోరెన్సిక్‌ లాబ్‌ కు పంపిన సంగతి తెలిసిందే. కోర్టుకు వాటిని సమర్పించిన ఫోరెన్సిక్‌ లాబ్‌ తమ అనుమతితోనే వాటిని ఎవరికైనా ఇవ్వాలని షరతు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఎసిబి కోర్టు జడ్జి ఆ నివేదిక కాపీని ఎసిబి లాయర్‌ కు చూపించారు. ఎప్‌ ఎస్‌ ఎల్‌ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. దాంతో ప్రత్యేకంగా అందుకోసం ఎసిబి సిద్దమవుతోంది. ఈ వివరాలు వస్తే హైకోర్టులో తన వాదన వినిపించాలని అనుకున్న ఎసిబి కి ఇది కొత్త సమస్య అవుతుందా?లేక రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వాయిదా కు ఆస్కారం అవుతుందా అన్నది చూడాలి.