రైతాంగ సమస్యలపై 10న తెలంగాణ బంద్
– ఒక్కతాటిపై విపక్షాలు
హైదరాబాద్, అక్టోబర్8(జనంసాక్షి):
రైతుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. గతంలోనే ఎవరికి వారు నిర్ణయం తీసుకున్నా,గురువారం ఉదయం శాసనసభ ఆవరణలో విపక్షనేతలు సమావేశమై ఈ మేరకు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలను చర్చించారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించి సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి,బిజెపిలు కలసి భరోసాయాత్రలను చేపట్టాయి. ఈ దశలో సమస్య తీవ్రతను తెలియ చేసేందుకు రైతుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి.
అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ భవన్లో జరిగినట్లుందని ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. ఫాంహౌస్‌లో మాదిరిగా చర్చించారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ జరిగిన 7 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రైవేటు అప్పులపై మారటోరియం విధించాలని కోరారు. కరవు మండలాలను ప్రకటించాలని కోరారు. రైతులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, తక్షణం రైతు సమస్యలు పరిష్కరించాలని రమణ డిమాండ్ చేశారు. అధికారపక్ష దగాకోరు నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఏడు రోజుల్లోనే ముగించారని బీజేపీ ఎమ్మెల్యే చింతల పేర్కొన్నారు. ప్రతిపక్షాల సలహాలు పక్కన పెట్టి అహంకారపూరితంగా వ్యవహరించారని, రైతాంగ సమస్యల పట్ల సీఎం కేసీఆర్ ప్రసంగం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎద్దేవా చేశారు. నెలాఖరులోగా రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండు చేశారు. అసెంబ్లీలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సర్కారు సానుకూలంగా స్పందించకుండా తమను బయటకు గెంటేశారని ఆరోపించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదిన జరిగే రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించాలని
కోరారు. తెలంగాణలో విపక్షాలు పదో తేదీన బంద్ ను విజయవంతం చేయాలని నిర్ణయించాయి. తెలంగాణ శాసనసభ ఆవరణలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి తదితర పక్షాలు సమావేశం అయి బంద్ తదితర అంశాలపై చర్చించాయి. బంద్ ను అన్ని పక్షాలు కలిసి విజయవంతం చేయాలని నిర్ణయించినట్లు పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు.రుణమాఫీ ని ఏకకాలంలో చేయాలన్న డిమాండ్ తో బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరితే శాసనసభ నుండి సస్పెండ్ చేశారని, రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే ఒకే దఫా రుణమాపీ చేయవచ్చని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 1400 మంది రైతు కుటుంబాలను ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గాందీ భవన్ లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయి బంద్ గురించి మాట్లాడారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో బంద్ విజయవంతం అయితేనే దాని ప్రభావం సీరియస్ గా ఉంటుందని, అందరూ గట్టిగా పనిచేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ తో పాటు బిజెపి, టిడిపిలు కూడా బంద్ కు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో పదో తేదీ బంద్ కు విశేష ప్రాముఖ్యత ఏర్పడుతోంది.