రైతులకు ఆదాయం సమకూరేలా చేయాలి

అన్నదాతలకు అండగా సిఎం కెసిఆర్‌ పథకాలు

నాబార్డు వార్షిక ప్రణాళిక విడుదలలో సిఎస్‌ ఎస్‌కె జోషి

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో వినూత్న పథకాలకు రూపకల్పన చేశారని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కోసం అన్ని స్థాయిల్లో కృషి జరగాలన్నారు. ఇటీవల తీసుకుని వచ్చిన పథకాలు అన్ని వర్గాలను మెప్పించాయని అన్నారు. నగరంలోని మ్యారీగోల్డ్‌ ¬టల్‌లో నాబార్డు రాష్ట్ర ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019-20 వార్షిక ప్రణాళికను ఎస్‌కే జోషి విడుదల చేశారు. అనంతరం జోషి మాట్లాడుతూ.. తరగిపోతున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులు అందించాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో రైతులకు బ్యాంకులు రుణాలు అందజేయాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్‌ సూచించారు. ఖర్చులు తగ్గించి ఉత్పత్తి, ఉత్పాదకత సాధన ద్వారానే ఆదాయం పెంపు సాధ్యమవుతుందని ఎస్‌కే జోషి స్పష్టం చేశారు. ఇదిలావుంటే ప్రాధాన్యతా రంగాలకు రూ. లక్ష కోట్లపైగా రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. 2018-19 సంవత్సరంతో పోల్చితే ఈసారి 22 శాతం పెంచారు. వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం రూ. 61,457 కోట్లు, మార్కెటింగ్‌, నిల్వ, భూమి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2,318 కోట్లు, వ్యవసాయ సహాయ కార్యకలాపాలు, ఫుడ్‌, ఆగ్రో శుద్ధి రంగాలకు రూ. 7,189 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు రూ. 1,008 కోట్లు కేటాయించారు. ఎగుమతులు, విద్యా, గృహ నిర్మాణం, సంప్రదాయేతర ఇంధన వనరులకు కూడా నిధులు కేటాయించారు.