రైతులకు ఇచ్చిన రుణాలు రూ. 16,124.37 కోట్లు
– శాసన మండలిలో మంత్రి ఈటెల
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు, 2016-17 సంవత్సరంలో 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4025.20 కోట్ల రుణాలు, 2017-18 సంవత్సరంలో 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4019.21 కోట్లు, మొత్తంగా ఇప్పటి వరకు 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు 16,124.37 కోట్లు రైతులకు రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించిన వాళ్లకు లక్ష రూపాయల వరకు వడ్డీ మాఫీ ఇస్తున్నట్లు తెలిపారు. లక్ష నుంచి 3 లక్షల వరకు పావులా వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. 60 ఏండ్లుగా తెలంగాణలో ఉన్న విద్యుత్ సమస్యను సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో తీర్చారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘పెండింగ్ ప్రాజెక్టుల పనులు త్వరితగతిన
జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను ఆధునీకరించామని ఈటెల సభలో పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, సాగునీటి కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 20వేల చెరువులను పునరుద్దరించామని, పునరుద్దరించిన చెరువుల కింద ఆయుకట్టు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. వచ్చే వానాకాలం నుంచి రెండు పంటలకు రూ. 8 వేల పెట్టుబడి అందిస్తామని మంత్రి తెలిపారు. 22.75 మెట్రిక్ టన్నుల గోడౌన్లను అందుబాటులోకి తెచ్చామని, విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఈటెల పేర్కొన్నారు.