రైతులకు గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు
అధికారులు సమస్యలురాకుండా చూడాలి: కలెక్టర్
జనగామ,జనం సాక్షి ): ఎన్నో కష్టాలు పడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు, మద్ధతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మార్కెట్‌కు సరుకు తెచ్చే రైతుకు ఏలాంటి కష్టం కలుగకుండా చూడాలని, కొనుగోళ్లలో జాప్యం లేకుండా, హమాలీల సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. రైతు నుంచి సరుకులు కొనుగోలు చేసిన 24గంటల్లో బస్తాలను తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అమలు చేసే విషయంలో హమాలీలు నిరసనకు దిగితే సవిూప ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో పనిచేసే హమాలీలను రప్పించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుకు వచ్చే ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లకుండా మద్ధతు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వ రంగ సంస్థలు సరిపడా కొనుగోలు చేసిన తర్వాతనే ప్రైవేట్ ట్రేడర్లు, కవిూషన్ ఏజెంట్లకు అవకాశం ఇవ్వాలనీ ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో ప్రభుత్వరంగ సంస్థల కొనుగోళ్లు పెరిగితే క్రమంగా ట్రేడర్ల కొనుగోళ్లు తగ్గుతాయని అన్నారు. తద్వారా రైతులకు ప్రభుత్వ మద్దతు, గిట్టుబాటు అందుతుందన్నారు. కొనుగోలు కేంద్రం సిబ్బందితో వరికోతలు, మాయిశ్చర్, ధాన్యం తరలింపు, మార్కెట్‌లో సదుపాయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్ ట్రేడర్లు, కవిూషన్ ఏజెంట్లు, రైస్ మిల్లర్ల కొనుగోళ్ల అంశాలపై సవిూక్షించారు. మార్కెట్ యార్డుల్లో ప్రైవేట్ ట్రేడర్లకు అవకాశం లేకుండా వీలైనంత ఎక్కువ మొత్తం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. 17శాతం తేమ ఉన్న ధాన్యానికి మద్ధతు ధర అందిస్తూ అంతకంటే ఎక్కువ మాయిశ్చర్ ఉన్న సరుకులు కూడా కొనుగోలు చేసి నిబంధనల మేరకు ధర తగ్గించాలన్నారు. తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని ప్రైవేట్ ట్రేడర్లు ఏవిధంగా కొంటున్నారో అదేవిధానాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అనుసరించాలని, తేమ సాకుతో కొనుగోలు నిరాకరించవద్దని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా కవిూషన్ ఏజెంట్లు, ట్రేడర్లు రైతులకు తప్పనిసరి తక్‌పట్టీలు ఇచ్చే విధంగా చూడాలని, ప్రతీ కొనుగోలు నిబంధనల ప్రకారం జరగకుంటే కవిూషన్ ఏజెంట్లకు నోటీసులు ఇవ్వాలని అన్నారు. మాయిశ్చర్ కొద్దిగా ఎక్కువగా ఉన్నా ఆరబెట్టుకున్న తర్వాత కొనుగోలు కలెక్టర్ ఆదేశించారు. తక్‌పట్టీల విషయంలో ప్రతీరోజు సివిల్ సైప్లె, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, బస్తాల తరలింపులో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.ట్రాన్స్‌పోర్టు లారీలను పంపించడంలో ఆలస్యం చేస్తే సివిల్‌సైప్లె, మార్కెటింగ్ అధికారులు వాహనాల కోసం ఎదురుచూడకుండా అదే ధరకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాలని,
హమాలీల విషయంలోనూ పూర్తిగా నిబంధనలను పాటించాలన్నారు. రైతుల శ్రేయస్సు కోసం చేస్తున్న
పనిలో అడ్డుతగిలితే చట్టపరిధిలో చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.