రైతులకు పరిహారం చెల్లింపు
మెదక్,ఆగస్ట్21(జనం సాక్షి): రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూములను తీసుకోవాల్సి వస్తుందని రెవెన్యూ అధికారులు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, మల్కాపూర్ గ్రామాలకు చెందిన 117 మంది రైతులకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ రైతులకు ఎంతో ప్రయోజనంచేకూరుతుందన్నారు. గుండ్రెడ్డిపల్లిలో 71 మంది రైతుల నుంచి ,ఈ గ్రామ శివారులోని రైతుల నుంచి తీసుకుంటున్న పట్టాభూములకు పరిహారం చెల్లించామన్నారు. అలాగే వెంకటాయపల్లిలో 26 మంది రైతుల నుంచి తీసుకున్న 18ఎకరాల 39గుంటల భూమికి చెక్కులను పంపిణీ చేశామన్నారు. వెంకటాయపల్లి శివారులోని పట్టాభూములకు ఎకరాకు రూ.9లక్షల 50వేల వంతున, ప్రభుత్వ భూములకు గాను ఎకరాకు రూ.4లక్షల 25వేల చెల్లించడం జరిగిందన్నారు. మల్కాపూర్‌లో 20 మంది రైతులకు గాను రూ.79లక్షలను అందజేశామన్నారు. అయితే రైతులు బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమ భూములను కోల్పోయిన రైతాంగానికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
—