రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకం: వేముల
నిజామాబాద్,మే12(జనం సాక్షి ): రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం జలాల్పూర్లో రైతుబంధు చెక్కులను, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఇది పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు వేయడానికి ఎలాంటి అప్పులు చేయొద్దని పెట్టుబడి సాయం అందిస్తున్నామని అన్నారు. ఉపాధికోసం ఇతర దేశాలకు వెళ్లిన వారి పేర్ల విూద చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు ఉంటే వాటిని త్వరలోనే వారి కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఎంపీపీ రాధ, వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ లలిత, సర్పంచి గంగారాం, రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త విద్యాసాగర్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.