రైతులను పట్టించుకోని ఘనత కాంగ్రెస్‌దే
అందుకే విమర్శలు చేస్తున్నారు: జోగు
ఆదిలాబాద్,అక్టోబర్28(జనంసాక్షి):ఏనాడూ రైతుల సంక్షేమాన్ని, ప్రాజెక్టుల నిర్మాణాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జోగురామన్న అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు, కొనుగోలు కేంద్రాలను పెంచి వారికి అండగా ఉంటున్నామని అన్నారు. ఎకరాకు నాలుగువేల పెట్టుబడి ఇవ్వడంతో కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏవిూ లేదన్నారు. భారీగా నిధులు ఖర్చుపెట్టి రైతాంగానికి సాగునీరు అందించిన తీరు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అనేక విధాలుగా ఇప్పుడు ప్రయోజనాలు వస్తున్నాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌కు ఉన్న అవగాహనతో పాటు ఆయన రైతాంగం కోసం చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు గోదావరికి మహర్దశ ఇవ్వనున్నాయని అన్నారు. ఎస్సీరెస్పీ పురుజ్జీవ పథకం తెలంగాణ చరిత్రలో మైలురాయి వంటిదని ఎస్సీరెస్పీ పథకంతో తెలంగాణ ఉత్తర ప్రాంతానికి ఎంతో మేలు జరగగలదని అన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో అనేక ప్రాజెక్టులకు వేసిన శంకుస్థాపనలు సమాధి రాళ్లుగా మారితే… వాటన్నింటినీ పునరుద్ధిరించి కోట్లాది రూపాయలు వెచ్ఛించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించారని అన్నారు. అలాగే పెనుగంగా, సదర్‌మాట్, స్వర్ణ నదులపై చెక్‌డ్యాములు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో డిసెంబర్ నాటికి ఇంటింటికీ తాగునీరు అందించి ప్రజారోగ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందించడంతో ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడ్డాయన్నారు. పత్తిరైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నిచర్యలు తీసుకున్నామని చెప్పారు.