రైతులను పురుగుల మందు పేరుతో మోసం

గుంటూరు : ప్ర‌త్తిపాడులో ఓ పురుగుమందుల వ్యాపారి న‌మ్ముకున్న వారిని న‌ట్టేట‌ముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ న్యాయం చేయాలని రోడ్డెక్కారు. ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్డుపై బైఠాయించి తమ బాధను వెళ్లగక్కారు. వివరాల్లోకెళితే..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలో తిరుమల ఎంటర్‌ప్రైజెస్ పేరుతో అన్నపురెడ్డి నాగిరెడ్డి అనే వ్యక్తి ఎరువులు, పురుగుమందుల వ్యాపారం సాగిస్తున్నాడు. చాలా కాలంగా వ్యాపారం చేస్తూ ఇక్కడి రైతుల మన్ననలు చూరగొన్నాడు. ఇటీవల కాలంలో తన వ్యాపారంలో పెట్టుబడులు పెడితే బోలెడు రాబడి పొందవచ్చునని చాలా మంది రైతులను తన వలలో వేసుకున్నాడు. నాగిరెడ్డి పాతవాడు కావడం, వ్యాపారం చేస్తుండటంతో నమ్మిన మండలం పరిధిలోని దాదాపు 280 మంది రైతులు ఆయన వద్ద పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తున్నది.

గత వారం రోజులుగా దుకాణం తెరవకపోవడం, సదరు నాగిరెడ్డి కనిపించకుండా పోవడంతో.. మోసపోయామని రైతులు గ్రహించారు. వీరి నుంచి దాదాపు రూ.30 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. పెట్టుబడులకు అధిక రాబడి ఇస్తానని చెప్పడంతో నమ్మి మోసపోయామని బాధితులు గొల్లుమంటున్నారు. దీంతో ఆందోళ‌న చెందిన రైతులు త‌మ మొత్తాల‌ను ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడ‌ని, పోలీసులు పూర్తి స్థాయిలో విచార‌ణ చేసి ప‌ట్టుకుని త‌మ‌కు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తమ వినతిని పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఓల్డ్ మద్రాస్ రోడ్డుపై కొద్దిసేపు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులకు నచ్చజెప్పి పంపించివేశారు. రైతులను మోసం చేసిన నాగిరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.