రైతులను రాజుగా చేయడమే కెసిఆర్ లక్ష్యం: బోడకుంటి
జనగామ,ఫిబ్రవరి11(జనంసాక్షి): రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారనీ, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం, ఉచితంగా రైతుకు జీవిత బీమా, భూప్ర క్షాళన, పాస్‌పుస్తకాల పంపిణీ వంటివి దేశానికి ఆదర్శంగా నిలిచాయని మండలి విప్ బోడకుంటి వెంకటేశ్‌ర్లు అన్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రై తుబంధు పథకం జాతీయ స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. పసుపు పంటకు త్వరలోనే మంచి రోజులు వస్తాయనీ, ఇప్పటికే అనేక పంటలకు మద్దతు ధరను ప్రకటించి ప్రభు త్వ సంస్థల చేత కొనుగోలు చేస్తున్నదన్నారు. మండలకేంద్రం బచ్చన్నపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన తనను కలసిన విలేకర్లో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందనీ, నిరంతరం సాగునీటితో భూములు సస్యశ్యామలమై సుభిక్షంగా పంటలు పండడం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగడం ఖాయమని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారనీ, స్థానికంగా ఏవైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రా వాలన్నారు.