రైతులపట్ల సర్కారు అనుకూల ధోరణి ప్రదర్శించాలి
– ప్రొఫెసర్ కోదండరామ్
హైదరాబాద్,అక్టోబర్12(జనంసాక్షి):
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా కరువు మండలాలను గుర్తించి ప్రకటించాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. దీంతో కేంద్రం నుంచి సాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు అనుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. రైతులు ఆందోళనకు గురి కావద్దని, అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను ఒంటరి చేయవద్దని అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గ్రామాల్లో కరువు పరిస్థితిని పరిశీలించేందుకు తరాజ్ అభియాన్‌తో రైతు సంవేదన యాత్రలో పాల్గొన్నామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించి సాయం అందివ్వాలన్నారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడారు. తెలంగాణ అంశంలో తమ ఉద్యమానికి విరామం మాత్రమేనని, విరమణ మాత్రం కాదని చెప్పారు. తెలంగాణ బిల్లు విషయంలో కెసిఆర్‌తో పాటు అన్ని పార్టీలు కీలక పాత్ర పోషించాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) కొనసాగుతుందని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కంకణబద్దులం అవుదామన్నారు. తెలంగాణ స్వప్నం సాధించే వరకు తెలంగాణ జేఏసి కొనసాగాలని అన్నారు. రైతుల సమస్యలపై లోతైన అధ్యయనం జరగాలన్నారు.