రైతులు ఆత్మహత్యలు చేసపకోవద్దు

3

– కర్ణాటకలో రాహుల్‌ పర్యటన

హైదరాబాద్‌ అక్టోబర్‌10(జనంసాక్షి):

సమస్యలకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కర్ణాటకలో కరువు పీడిత ప్రాంతాల్లో రాహుల్‌ పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. హవేరీ జిల్లాలోని మైదూర్‌ గ్రామం నుంచి ఏడు కిలోమీటర్ల పాదయాత్రలో పలువురు రైతులను పరామర్శించారు. ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. మైదూర్‌లో పాఠశాల విద్యార్థులను కలిసి కాసేపు ముచ్చటించారు.

ప్రజలను విభజిస్తున్నారు

మోదీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రాహుల్‌

హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ దేశ ప్రజలను విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రతీసారి ఎన్నికల సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ నేతలకు అలవాటేనన్నారు. దాద్రీలో ‘గోమాంస’ ఘటనే ఇందుకు ఉదాహరణ అని, అందులో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. కర్ణాటక రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రాష్ట్రంలో శుక్రవారం మాండ్య ప్రాంతంలోని పణకనహళ్లి, సణబదకొప్పలు గ్రామాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులు మహేష్‌, లోకేశ్‌ల కుటుంబాలను రాహుల్‌ పరామర్శించారు.