రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు

5

– సకల చర్యలు తీసుకుంటున్నాం

– అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ భరోసా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): రైతలు ఆత్మహత్యలకు కారణాలు అనేకం ఉన్నాయి, దీనికి ఏ ఒక్కరినో నిందించడం సరికాదని సిఎం కెసిఆర్‌ అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ఇది కూడా ఓ కారణమన్నారు. రైతుల కోసం అన్ని విధాలుగా తమ ప్రభుత్వం పనఇచేస్తోందని, అందువల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సభాముఖంగా సిఎం కెసిఆర్‌  విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 9గంటల పగటి విద్యుత్‌ ఇచ్చి తీరుతామన్నారు. శాసనసభలో రైతుల సమస్యలపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. మనం రైతులం, రైతు కుటుంబాల నుంచే వచ్చాం, అందరికీ సమస్య తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమంలో మన ప్రధాన డిమాండ్‌ నిధులు, నీళ్లు, నియామకాలేనని గుర్తు చేశారు. 55 ఏళ్ల ఉమ్మడి పాలనలో ఘోరంగా మోసపోయామన్నారు. శాశ్వతంగా నీరు రావడం, నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయడం,చిన్ననీటి పారుదల రంగాన్ని పటిష్టం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇది పూర్తయితే సమస్య తీరుతందన్నారు. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూసి ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా నిలవాలన్నారు. శాసనససభలో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా దీర్ఘకాలిక చర్యలకు సభ్యుల నుంచి మార్గ నిర్దేశర వస్తుందనుకున్నా… కానీ అలా జరగలేదన్నారు. రైతు ఆత్మహత్యల సమస్య మనవద్దే కాదు… దేశమంతా ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యలు ఎక్కువగానే ఉన్నాయన్నారు.  రైతుల సమస్యలు, ఆత్మహత్యలపై హైకోర్టు చక్కని సలహా ఇచ్చిందన్నారు. కోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు.  ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, వారికి ఉపశమనం కలిగించడం సరికాదని కోర్టు పేర్కొనడం సరైంది. కానీ పరిహారాలు, ఉపశమనాలు తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించండని పేర్కొంది. తమ ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారం కోసం ముందుకు పోతుందని సిఎం కెసిఆర్‌  తెలిపారు. హైకోర్టు బాధ్యాతయుతమైన సలహా ఇచ్చినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. సమస్య మూలాల్లోకి వెళ్లాలన్న హైకోర్టు సూచనను స్వీకరిస్తున్నామన్నారు. తాను స్వయంగా రైతునని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. వర్షాభావ పరిస్థితి వల్ల తాను పెట్టిన అల్లం పండుతుందో ,లేదో తెలియదని ఆయన అన్నారు. ఎర్రవెల్లి గ్రామస్తులకు కూడా ఇదే విషయం చెప్పానని అన్నారు. యావత్‌ తెలంగాణ అంతా ఆకాశం వైపు వర్షం కోసం ఎదురు చూడవలసి వస్తున్నదని అన్నారు. కొద్ది ప్రాంతాలకే నీటి సదుపాయం ఉందని కెసిఆర్‌ అన్నారు. భారత దేశంలో ఎక్కడా లేనన్ని విత్తన కంపెనీలు హైదరాబాద్‌ లో ఉన్నాయని ఆయన అన్నారు. 364 కంపెనీలు ఉన్నాయని ఆయన తెలిపారు. విత్తనపరిశ్రమ సంఘం కార్యదర్శి తనకు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ఇక్కడ నుంచి దేశంలోని అరవై శాతం విత్తన అవసరాలను తీర్చుతున్నామని తెలిపారని ఆయన వివరించారు. ప్రతిపక్షం అన్న తర్వాత లోపాలు ఎత్తి చూపుతారని,దానిని తప్పు పట్టనవసరం లేదని ఆయన అన్నారు. విపక్ష నేత జానారెడ్డి అనేక పోర్ట్‌ ఫోలియోలు నిర్వహించిన నేత అని ఆయన కూడా ఇచ్చే సలహాలను తప్పనిసరిగా తీసుకుంటామని అన్నారు. అందరం కలిసి రైతుల కన్నీళ్లు తుడవవలసిన అగత్యం ఉందని అన్నారు. ఒక వైపు రైతుల ఆత్మహత్యలు, మరో వైపు విత్తన బాండాగారంగా తెలంగాణ ..ఎక్కడ ఈ వైరుధ్యం ఉందని అన్నారు. ఈ సమస్య రాత్రికి రాత్రే పోయేది కాదని ఆయన అన్నారు. ఎంతో కాలంగా ఉన్న ఈ సమస్య ఇప్పటికిప్పుడు పోతుందనుకుంటే పిచ్చితనం అని అన్నారు. అరవైఏళ్ల సమైక్య రాష్ట్రంలో జరిగిన ప్రాంతీయ వివక్ష దీనికి ఒక ముఖ్యకారణంగా ఉందని కెసిఆర్‌ అన్నారు. పొరుగు రాష్ట్రాలలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నల్లొండ జిల్లాలో బోర్‌ వెల్‌ రెడ్డి గా పేరొందిన రైతు యాభై నాలుగు బోర్లు వేసి తీవ్రంగా దెబ్బతిన్నారని అన్నారు. 2001 లో పెరుగు అన్నం తినే రైతు పురుగు మందు తాగుతున్నారని తాను రాశానని ఆయన అన్నారు. వ్యవసాయ యూనివర్శిటీని పరిశోధన లేకుండా ద్వంసం చేశారని సిఎం కెసిఆర్‌ అన్నారు. వ్యక్తులనో,పార్టీలనో అనదలచుకోలేదని అంటూ పదమూడువేల మంది వ్యవసాయ సిబ్బందికి గాను ఐదువేల ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఎన్నో కారణాల సమాహారం వల్ల ఈ మారణ కాండ జరుగుతోందని కెసిఆర్‌ అన్నారు. నిరంతరం జరిగిన తప్పుల ఫలితమే ఈ నాటి పరిస్థితి అని కెసిఆర్‌ వివరించారు. నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులను పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఒక్క చెరువును కూడా పూడికతీసిన దాఖలాలు లేవన్నారు. ఇవళా తాము మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ చేపట్టామన్నారు.