రైతులు ఆలోచించాలి

24 గంటల కరెంటు  అందించే పార్టీ కావాలా.?

3 గంటల కరెంట్ అందించే పార్టీ కావాలా.?

– రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : కాలం కాక‌పోయినా.. రెండు పంట‌లు పండే నీళ్లు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని రైతుల‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు భ‌రోసానిచ్చారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సిద్దిపేట రూర‌ల్ మండ‌లం రాఘ‌వాపూర్ రైతు వేదిక‌లో ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.ఒక గంట క‌రెంట్‌తో ఒక గుంట భూమి కూడా త‌డ‌వ‌ద‌ని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలివి లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడో దొంగ రాత్రి క‌రెంట్ ఇచ్చేవార‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైతులు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. దొంగ రాత్రి క‌రెంట్ ఇస్తే.. ఆ స‌మ‌యంలో బావుల వ‌ద్ద‌కు వెళ్లి పాము కాట్ల‌కు రైతులు ఎంద‌రో బ‌ల‌య్యారు. క‌రెంట్ షాక్‌ల‌తో కూడా రైతులు చ‌నిపోయార‌ని మంత్రి గుర్తు చేశారు.ఒక విద్యుత్ క‌నెక్ష‌న్ మీద ప్ర‌భుత్వం రూ. 25 వేలు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. రైతుబంధు కింద రూ. 14 వేల కోట్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. గోడౌన్లు ఇంకా మిగ‌తా వాటికి రూ. 6 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.చంద్ర‌బాబు వార‌సుడే రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వ్య‌వ‌సాయం దండ‌గ అని.. ఐటీ కంపెనీలు పెంచండి అని బాబు అన్నారు. క‌రెంట్ బిల్లులు త‌గ్గించ‌మ‌న్న రైతుల‌ను బ‌షీర్‌బాగ్‌లో కాల్చి చంపించాడ‌ని గుర్తు చేశారు. ఈ విష‌యాల‌పై రైతులు చ‌ర్చ చేయాలి. గ‌తంలో మ‌న‌కు క‌రువొచ్చి బ‌త‌క‌డానికి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు మ‌న వ‌ద్ద‌కు బ‌తికేందుకు వ‌స్తున్నారు. కాంగ్రెస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని రైతులను కోరుతున్నాన‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు