రైతులు పశువులను పెంచుకుంటే అదనపు ఆదాయం వస్తుంది.

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి. వెంకటేశ్వర్లు.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 7 జనం సాక్షి.
రైతులు పశువులను పెంచుకోవడం వలన వారికి అదనపు ఆదాయం సమకూరుతుందని జోగులాంబ గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి. వెంకటేశ్వర్లు అన్నారు.
గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలో శనివారము ఉచిత గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్స, పశువైద్య శిబిరము జిల్లా పశుగణన అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులు పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయమే కాకుండా మనిషికి అవసరమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పాడి పశువుల ద్వారానే వస్తాయని పాడి పశు సంపద ను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన అన్నారు.
ఇందులో భాగంగా 30 గేదెలు, 21 ఆవులకు గర్భకోశ చికిత్సలు జరిపి ఉచితంగా లవణ మిశ్రమము, ఇంజక్షన్లు ఇవ్వడం జరిగినదనీ, వీటితోపాటు 48 దూడలకు నట్టల నివారణ మందులు తాపించడం జరిగినదనీ మండల పశు వైద్యాధికారి డాక్టర్ కే.శంకరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వర్లు ,మండల పశువైద్యాధికారి డాక్టర్ కే శంకరయ్య తో పాటూ వెటర్నరీ అసిస్టెంట్ శశి కుమార్, జూనియర్ అసిస్టెంట్ భీమయ్య, గోపాలమిత్ర సూపర్వైజర్ కె.ఇ.వంశీకృష్ణ,గోపాలమిత్రలు ప్రభాకర్, రామాంజనేయులు , ఓ ఎస్ అనిల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.