రైతులు ప్రధాని ఎజెండాలో లేరు
– కర్షక ఆత్మహత్య కుటుంబాలను పరామర్శించిన రాహుల్
పాట్నా అక్టోబర్ 9 జనంసాక్షి):
రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. రెండు రోజుల పర్యటనకు కర్నాటక వచ్చిన ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.వ్యవసాయం, రైతులు అంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేది ప్రధాని కార్యాలయం, అక్కడి ఉన్నతాధికారులే అన్నట్లు ప్రధాని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ప్రధానికి సమయం ఉంటుంది కానీ, రైతు కుటుంబాలను కలుసుకునేందుకు సమయం దొరకడం లేదని రాహుల్ విమర్శించారు.రాష్ట్రాలకు సాయం చేయడంలో కూడా కేంద్రం పక్షపాతం చూపిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ ప్రభుత్వం సమయంలో రైతులందరిని సమానంగా చూసేవారమని, కానీ ఎన్డీయే హయాంలో కర్ణాటక రైతులు, బీహార్ రైతులు అని వేరు చేసి చూస్తున్నారన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఎన్డీయే సర్కారు విఫలమైందన్నారు.దాద్రీ ఘటనపై ప్రధాని స్పందనలో స్పష్టత కరువైందన్నారు రాహుల్ గాంధీ. దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రతీసారి ఏదో ఒక చోట మతఘర్షణలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. దాద్రీ ఘటన వెనుక బీజేపీ నేతలు ఉన్నారని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. హిందూ, ముస్లింలను వేరు చేసి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.రైతుల కోసం రాహుల్ పర్యటనకు వస్తే? కాంగ్రెస్ శ్రేణుల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. రాహుల్ సభ కోసం హవేరీలో పచ్చటి పంట పొలాలను ధ్వంసం చేయడం వివాదాస్పదం అయ్యింది. పంటలను నాశనం చేయడంపై బీజేపీ సహా విపక్షాలు కాంగ్రెస్ ను ఇరుకున పెడుతున్నాయి.