రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తారో చెప్పండి

2

– రెండు రాష్ట్రాలను నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):  రైతు ఆత్మహత్యల నివారణకు అమలు చేస్తున్న పథకాలు వివరించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ రైతులను భాగస్వామ్యం చేసి స్టేట్‌ లెవల్‌ అగ్రికల్చర్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నిర్ణయం చెప్పాలని కోర్టు సూచించింది.  రైతు ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండిపడింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన వివరణకు పిటీషనర్లు సంతృప్తిగా లేరని, గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, పాలసీలు అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపిన సమాధానానికి కోర్టు సంతృప్తి చెందలేదు. రైతు ఆత్మహత్యల నివారణకు గత నెల 30న ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో రైతు సంఘాలతో సమావేశం నిర్వహించామని, స్టేట్‌ లెవల్‌ అగ్రికల్చర్‌ కమిషన్ను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే రైతు ఆత్మహత్యల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తసుకోవాలని, ఆరు వారాల్లో ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్న ప్రభుత్వాలు హైకోర్టుకు తెలిపాయి. దీనిపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని…రైతు ప్రతినిధులు సూచించారని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు సూచన మంచిదేనని  హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు సూచనల అమలుకు సమయం కావాలని తెలుగు ప్రభుత్వాలు కోరాయి. దీనిపై ఆరువారాల్లో నిర్ణయం చెప్పాలని  హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇప్పటికే ఈ విషయంపై కోర్టు పలుసార్లు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు రైతు సంఘ నేతలతో సమావేశాలు జరిగాయి. తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు పలు సూచనలు చేసింది. రైతు భాగస్వామ్యంతో కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, దీనిపై కోర్టు కూడా సంతోషం వ్యక్తం చేసిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. రైతులకు సంబంధించి కమిషన్‌ రావడం సంతోషకరమన్నారు. కానీ వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరడం జరిగిందన్నారు. ఎన్నో పాలసీలు ఉన్నాయని, కానీ ఈ పాలసీలు సరియైన విధంగా రైతులకు అందడం లేదని కోర్టుకు తెలపడం జరిగిందని తెలిపారు. అందుకని దీనిపై మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరగిందన్నారు. అలాగే రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు అందే విధంగా చూడాలని, ఎప్పుడు అవసరమైతే రైతులకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలని అందుకు మైక్రో ఫైనాన్స్‌ అవసరమని తాము కోర్టుకు చెప్పడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.