రైతుల కోసం కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌

ఆదిలాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో త్వరలో కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ తెలిపారు. హెల్ప్‌లైన్‌తో రైతుల సమస్యలను పరిష్కరించేదుకు కృషి చేస్తామన్నారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి భూసార పరీక్షలు నిర్వహించి, భూమికి అనుకూలమైన పంటసాగు వైపు రైతులు మొగ్గుచూపే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిని ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నందున రైతులకు అండగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతోందని, రైతులు నిరాశ, నిస్పృహకు లోనుకావొద్దని అన్నారు. పంట సాగు కోసం ప్రభుత్వం ఎకరానికి రూ. నాలుగు వేల చొప్పున వ్యవసాయ పెట్టుబడిని అంజేస్తుందని చెప్పారు. జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానని అన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించేందుకు బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. పత్తి పంట ఎక్కువగా సాగవుతోందని, కేవలం వర్షాధార పంటలు మాత్రమే సాగవుతాయని తెలిపారు. రైతులకు పంటసాగుపై వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు మెళకువలు తెలియజేయాలని ఆదేశించారు. పంట మార్పిడితో కలిగే లాభాలు తెలియజేయాలని, దీంతో రైతులు అధిక దిగుబడులు సాధించి లాభాల బాట పడుతారని వివరించారు. రైతులకు ఎప్పటికప్పుడు విత్తనాలు, ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, పంట రుణాలు అందజేయాలని ఆదేశించారు. రైతులు నాసిరకం విత్తనాలతో మోస పోకుండా చూడాలని, నాణ్యమైన విత్తనాలు వాడే విధంగా చర్యలు తీసుకొని, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాకు కొత్తగా 20 చెరువులు మంజూరు అయ్యాయని, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.