రైతుల లాంగ్‌మార్చ్
– వందకిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ
– పోలీసుల అనుమతి
దిల్లీ,జనవరి 23(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. 26న ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై 100 కీలోమీటర్ల వరకు సాగుతుందని రైతు నేత అభిమన్యు కోహర్ తెలిపారు. రాత్రికి పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఈ మేరకు రైతు సంఘాలు, పోలీసుల సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఈ ర్యాలీలో వేల మంది రైతులు పాల్గొంటారని మరో రైతు నేత గుర్నామ్ సింగ్ తెలిపారు. ఆ రోజు దిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగిస్తారని చెప్పారు. శాంతియుతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని రైతులకు నేతలు సూచించారు. కాగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం రాత్రి సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల కవాతులో తమలో నలుగురిని చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలిపారు. తద్వారా కవాతును భగ్నం చేసి ఆందోళనను అణదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఇందుకోసం రంగంలోకి దింపిన ఓ వ్యక్తిని తాము పట్టుకున్నట్లు తెలిపారు. ముఖానికి ముసుగు తొడిగిన అతణ్ని శుక్రవారం రాత్రి విూడియా ముందుకు తీసుకొచ్చారు. పోలీసు వలే నటించి కవాతులో రైతులపై లాఠీ చార్జి చేయాలని అతనికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.విూడియా సమావేశం అనంతరం అతణ్ని హరియాణా పోలీసులకు అప్పగించినట్లు రైతు సంఘాల నాయకుల్లో ఒకరైన కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ఈ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తే కుటుంబసభ్యులను చంపేస్తామని దీన్ని అమలు చేయాల్సిన వ్యక్తులను బెదిరించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన దిల్లీ పోలీసులు.. తమకు ఎలాంటి ముసుగు తొడిగిన వ్యక్తి సమాచారం అందలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని పేర్కొన్నారు.రైతులు తాము పట్టుకున్నట్లుగా చెప్పిన ముసుగు తొడిగిన వ్యక్తి విూడియాతో మాట్లాడుతూ…”జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని నిర్ణయించకున్నాం. ఒకవేళ వారు ఆగకపోతే.. తొలుత గాల్లోకి కాల్పులు జరపాలనుకున్నాం. తర్వాత మా బృందంలోని మరికొంత మంది సభ్యులు వెనక నుంచి కాల్పులు జరుపుతారు. అక్కడ ఉన్న దిల్లీ పోలీసులు.. రైతులే కాల్పులు జరుపుతున్నారని భావించి ఎదురుకాల్పులు జరుపుతారు” అని చెప్పుకొచ్చాడు.మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య శుక్రవారం 11వ విడత చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. చట్టాల అమలును రెండేళ్ల పాటు వాయిదా వేస్తామని కేంద్రం ప్రతిపాదించినట్లు తెలిసింది. కానీ, రైతులు మాత్రం చట్టాలను పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని పట్టుబట్టారు. రద్దు డిమాండ్‌ను అంగీకరించేదిలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వ వైఖరి సరిగాలేదని, తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, 26న ట్రాక్టర్ల కవాతు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మరోవైపు సాగు చట్టాలపై రైతులతో ఇక చర్చలు ముగిసినట్లేనని వ్యవసాయ మంత్రి తోమర్ తెలిపారు.