రైతుల సంక్షేమమే తెరాస ధ్యేయం
– ఆమేరకే నాలుగేళ్లు కేసీఆర్ పాలన సాగించారు
– కాళేశ్వరం పూర్తయితే నిర్మల్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది
– ఆపద్ధర్మ మంత్రి ఇంధ్రకరణ్‌రెడ్డి
నిర్మల్, నవంబర్3(జనంసాక్షి) :రైతుల సంక్షేమమే తెరాస ధ్యేయమని, ఆమేరకు నాలుగేళ్లలో కేసీఆర్ పాలన సాగించారని, రైతులను రాజులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమించారని ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్మణ చాంద మండలంలో పర్యటించారు. కనకాపూర్, వడ్యాల్, రాచాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి అల్లోలకు ఆపూర్వ ఆధరణ లభించింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్వాగతం పలికారు. గడప గడపకూ తిరుగుతూ టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వృద్దులకు, బీడీ కార్మికులకు రూ.2016 ఆసరా ఫించన్ ఇస్తామన్నారు. పంట పెట్టుబడిని రూ.10వేలకు పెంచుతామన్నారు.
ఈ సందర్బంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టారని, రైతుబందు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి ఎకరానికి రూ. 4వేల చొప్పున ఏడాదికి రూ. 8వేలను అందజేస్తున్నామన్నారు. రైతులకు మద్ధతు ధర కల్పిస్తూ వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే నిర్మల్ జిల్లా సస్యశామలమవుతుందన్నారు. నాడు వ్యవసాయం దండగన్నవారు మహకూటమి పేరుతో మరోసారి వంచించేందుకు విూ ముందుకు రాబోతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తెరాసతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేత శ్రీహరి రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, టీఆర్‌ఎస్ లక్ష్మణచాంద మండల కన్వీనర్ రఘువర్దన్ రెడ్డి, ఇతర మండల టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.