రైతు నాయకులతో హోమంత్రి అమిత్‌షా చర్చలు
దిల్లీ,డిసెంబరు 8 (జనంసాక్షి): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రాత్రి 7గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ చర్చల కోసం అమిత్ షా నివాసానికి చేరుకున్న రైతు నేతలు.. అక్కడ కాకుండా వేరే చోట సమావేశం జరపాలని కోరారు. దీంతో దిల్లీలోని పూసా వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వెళ్లి అక్కడే చర్చలు కొనసాగిస్తున్నారు. గత 13 రోజులుగా ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఆరో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఒక్కరోజు ముందే కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా చర్చలకు ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చలకు 13 మంది రైతు సంఘాల ప్రతినిధులు హాజరైనట్టు సమాచారం. ఈ చర్చల సందర్భంగా రైతులు తమ ఆందోళనలను విరమించాలని అమిత్ షా కోరనున్నారు. కేంద్రం ముందు తాము ఉంచిన అంశాలపై అవును, కాదు అనే డిమాండ్ తప్ప మరొకటి అడగబోమని రైతు నేతలు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరో మార్గంలేదని స్పష్టంచేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని రైతులు తేల్చి చెబుతున్నారు. చట్టాలను రద్దు చేయాలంటూ పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతు సంఘాలు.. భారత్ బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.