రైతు సంక్షేమంలో దేశానికి కెసిఆర్‌ ఆదర్శం

ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధు అమలు: ఎమ్మెల్యే
జగిత్యాల,జనవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, కేంద్రం కూడా ఈ పథకాలను అమలు చేసే దిశగా చేస్తున్న ఆలోచనలే కెసిఆర్‌ దార్శనికతకు నిదర్శనమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి  చేయడం ద్వారా కోటి ఎకరాల మాగాణ తెలంగాణ అన్న కల సాకారం చేయాలన్న సంకల్పం సాకారం కాబోతున్నదని అన్నారు. అందుకే కెసిఆర్‌ పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయని, కేంద్రం కూడా అదే రకమైన ఆలోచనతో ఉందని అన్నారు.  దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్‌ పంపిణీ చేస్తున్న ఘనత కెసిఆర్‌దన్నారు.  రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. రైతులను రాజులుగా చేయడమే సీఎం కేసీఆర్‌  లక్ష్యమన్నారు. రైతులకు నిరంతరంగా సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని తెలిపారు. ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. రైతుల సం క్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పలు సంక్షేమ పథకాలను ఆమలు చేస్తోందన్నారు. ప్రతి ఎకరానికి నీరందించేందుకు లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెంఛన్లు, డబుల్‌ బెడ్‌రూంలతో పాటు పలు సంక్షేమ పథకాలను అంది స్తామన్నారు. రైతుల ఆర్థికాభివృద్ది కోసం రైతు బందు, రైతు బీమా, పంట పెట్టుబడి, నిరంతర విద్యుత్‌ సరఫరాను ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందజేస్తున్న ఘనత సీఎం కేసీ ఆర్‌కే దక్కుతుందన్నారు.