రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయండి
మునగాల, అక్టోబర్ 12(జనంసాక్షి): విప్లవాల పురిటి గడ్డ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర గల మునగాల పరగణ ఈ ప్రాంతంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ద్వితీయ మహాసభలు జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అమరవీరుల స్మారక భవనములో బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్లు నాగార్జున రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ నెల 16న మునగాల మండల కేంద్రంలో జరుగు తెలంగాణ రైతు సంఘం జిల్లా ద్వితీయ మహాసభలు జరుగుతున్నయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ లను అమలు చేస్తానని, రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే రైతు వ్యతిరేక విధానాలు అమలు చేయుటకు మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఫలితంగా బిజెపి తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయక తప్పలేదని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించడంలో సవతి తల్లి ప్రేమ కనపరుస్తుందని, ఎరువులు, పురుగు మందుల, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని, విద్యుత్తును ప్రైవేటీకరణకు పూనుకుందని, వ్యవసాయ నుండి రైతులను దూరం చేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా ఒప్పజెప్పడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రుణమాఫీ ఏకకాలంలో చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు సంఘం నిరంతరం రైతుల పక్షాన నిలబడి రాజీలేని పోరాటని కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవారం వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, రైతు సంఘం మునగాల మండల అధ్యక్ష కార్యదర్శులు చందా చంద్రయ్య, దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, ఎస్కే సైదా, కోరుట్ల శ్రీను, సిఐటియు మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.