రైతు సమస్యలు వినేందుకు కమిటీ..


` కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన
` సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కూడా నిరసనలెందుకు?
` వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశ్న
దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడిరచారు. ‘రైతు సమస్యలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌, కనీస మద్దతు ధర వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం వంటి పలు అంశాలపై ఆ కమిటీ చర్చించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని నేను కోరుతున్నాను’ అని తోమర్‌ విూడియాతో వెల్లడిరచారు. మరోపక్క నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని మంత్రి అన్నారు. వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు. గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై పంజాబ్‌, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. రైతులు నిరసన తెలుపుతున్న క్రమంలో పలు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే చట్టాలతో తమకు కనీస మద్దతు ధర భరోసా ఉండదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో తమ నిరసనను మరింత ఉద్ధృతం చేయాలనే ఆలోచనలో ఉండగా.. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం కొద్ది రోజుల క్రితం ప్రకటన చేసింది. అలాగే సోమవారం ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో మొదటిరోజే వాటి రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడిరచారు.