రైలు ఘటన దురదృష్టకరం

– నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
అమృత్‌సర్‌, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన సంబరాల సమయంలో చోటుచేసుకున్న విషాదం అందర్నీ కలిచివేసిందని పంజాబ్‌ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు. శనివారం ప్రమాదంలో గాయపడి సివిల్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నవారిని సిద్ధూ  పరామర్శించారు. రావణ వధ వేడుకను చూస్తున్న వారిని రైలు ఢీకొట్టిన్న ఘటనలో 61మంది ప్రాణాలు కోల్పోయారని,  రైలు ఘటన దురదృష్టకరమని సిద్దూ అన్నారు. ఇది ప్రమాదమే అన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ ప్రమాదంలో పొరపాటు జరిగిందని, కానీ ఉద్దేశపూర్వంగా ఈ ఘటన జరగలేదన్నారు. కేవలం కొన్ని క్షణాల్లోనే ప్రమాదం జరిగిపోయిందని ఆయన తెలిపారు. రైలు హైస్పీడ్‌లో వచ్చిందని, రైలు హారన్‌ ఇవ్వలేదని సిద్ధూ అన్నారు. ఈ ఘటన పట్ల సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సిద్ధూ తెలిపారు. అయితే రావణ దహన కార్యక్రమానికి సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్దూనే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.