రైలు దిగి ఉంటే చిక్కడం కష్టసాధ్యమే

హైదరాబాద్‌ : నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్‌ అధినేత రోహిత్‌ కేడియా ఇంటి నుంచి రూ.40 కోట్ల సొత్తు, నగదుతో ఉడాయించిన త్రయం మోల్హు ముఖియా, సుశీల్‌ ముఖియా, బసంతి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కింది. నగరం నుంచి ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కిన వీరు ముగ్గురూ భోపాల్‌లో ట్రైన్‌ దిగిపోవాలని భావించారు. అదే జరిగితే వారు చిక్కడం కష్టసాధ్యమయ్యేదని, నిందితులు దొరికినా సొత్తు రికవరీ అయ్యేది కాదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరిలో దోమలగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకున్న స్నేహలత దేవి ఉదంతాన్నే ఉదాహరణగా చూపుతున్నారు.

నమ్మకంగా పని చేసిన మహేష్‌ కుమార్‌.. 
బీహార్‌ రాష్ట్రం, మధుబని జిల్లా, బిరోల్‌కు చెందిన  చెందిన మహేష్‌కుమార్‌ ముఖియా 2023 డిసెంబర్‌లో నగరానికి వలసవచ్చాడు. తన సోదరి వద్ద ఉంటూ… స్నేహితుడి ద్వారా దోమలగూడకు చెందిన సువర్య పవ గుప్తా ఇంట్లో కేర్‌ టేకర్‌గా చేరాడు. గుప్తా తల్లి స్నేహలత దేవి (62) వయస్సు రీత్యా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు సపర్యలు చేస్తూ నమ్మకం సంపాదించుకున్నాడు. గుప్తాతో పాటు అతడి కుటుంబీకులు ప్రతి రోజూ తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేవారు. ఆ సమయంలో స్నేహలత మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఈ విషయం తెలిసిన మహేష్‌ ఆమెను బంధించి, ఇంట్లో ఉన్న సొమ్ము, సొత్తు కాజేయాలని గత ఏడాది జనవరిలో పథకం వేశాడు.