రైల్వే ట్రాక్‌లపై బైటాయిస్తాం
– దేశాన్ని స్థంభింపజేస్తాం
– త్వరలో తేదీలు ప్రకటిస్తాం
– రైతు సంఘాలు
దిల్లీ,డిసెంబరు 10 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే రైల్వే ట్రాకులను నిర్బంధిస్తామని హెచ్చరించారు. త్వరలో దానికి సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని రైతు సంఘం నేత బూటా సింగ్ చెప్పారు. ఈ మేరకు దిల్లీ శివారులోని సింఘు వద్ద విూడియాతో మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రైతుల కోసం కాదని, వ్యాపారుల కోసమే కేంద్రం తీసుకొచ్చిందని మరో రైతు నేత బల్బీర్‌సింగ్ రాజేవాల్ అన్నారు. వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, దానిపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదని అన్నారు. ఆందోళన మరింత ఉదృతంగా మార్చుతామని కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది