రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు

రైల్వే బడ్జెట్ ఎటువంటి మెరుపులు లేకుండా లోక్ సభ ముందుకు వచ్చింది. ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో 2016-17 రైల్వే బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రణాళిక వ్యయం 1.21 లక్షల కోట్లుగా ప్రకటించారు. ఆదాయం లక్ష్యం 1,84,820 కోట్లుగా వెల్లడించారు. ప్రయాణీకుల రవాణా ద్వారా రూ. 51 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. కేంద్ర బడ్జెట్ ద్వారా రైల్వేలకు 10 వేల కోట్లు సమకూరతాయని వివరించారు. ఐదేళ్లలో రైల్వేలో ఎల్ఐసీ 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఐదేళ్లలో 8.5 లక్షల కోట్ల పెట్టుబడులతో రైల్వేలను ఆధునీకరిస్తామని తెలిపారు.

భారతీయులు గర్వపడేలా రైల్వేలను తీర్చిదిద్దుతామని సురేష్ ప్రభు అన్నారు. ప్రయాణీకుడే తమ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించారు. సమయపాలన, వసతులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వేగం, సమర్థత, పారదర్శకత పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేశామని సురేష్ ప్రభు చెప్పారు. ఇది సామాన్యుల బడ్జెట్ అన్నారు. ఆపరేటింగ్ రేషియో 92 శాతం సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ సబర్బన్ రైళ్ల విస్తృతికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది మూడు సరకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో నాగపూర్-విజయవాడ కారిడార్ కూడా ఉంది. ఈశాన్య రాష్ర్టాలకు బ్రాడ్ గేజ్ లైన్లు వేస్తామన్నారు.

గత రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదించిన 139 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని సురేష్ ప్రభు వెల్లడించారు. రైళ్ల సగటు వేగం 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెంచుతామని ప్రకటించారు. ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కిలోమీటర్లకు, ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం 80 కిలోమీటర్లకు పెంచుతామన్నారు. ఢిల్లీ-చెన్నై ట్రిప్లింగ్ పనులు చేపడుతామన్నారు.

రక్షణ లేని లెవెల్ క్రాసింగులను తొలగించే ప్రయత్నం చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. 2020 నాటికి సిగ్నల్ లేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్, 350 కాపలా ఉన్న లెవెల్ క్రాసింగ్స్ మూసివేశామని చెప్పారు. వాటి స్థానంలో 820 రైల్వే ఓవర్/ అండర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశామని, మిగతావి పనులు జరుగుతున్నాయని వివరించారు. అన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో మహిళల కోసం 33 శాతం సీట్లు కేటాయిస్తామని సురేష్ ప్రభు చెప్పారు. మహిళల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

మేకిన్ ఇండియాలో భాగంగా రూ. 40 వేల కోట్లతో రెండు లోకోమోటివ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది 2,200 కిలోమీటర్ల కొత్త బ్రాడ్ గేజ్ లైన్లు నిర్మిస్తామని చెప్పారు. దేశానికి వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నందున పోర్టులకు రైల్వే లైన్ల కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు. రైల్వే నియామకాలన్నీ ఆన్ లైన్ లోనే జరుపుతామని, టెండర్లను కూడా పేపర్ లెస్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాని(పీపీపీ)కి రైల్వే మంత్రి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపడతామన్నారు. రాష్ర్టాలతో జాయింట్ వెంచర్లు చేపడతామని ప్రకటించారు. 5,300 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణానికి అవగాహన ఒప్పందాలు (ఎంవోయులు) కుదుర్చుకున్నామని సురేష్ ప్రభు ప్రకటించారు. పీపీపీ విధానంలో 400 రైల్వేస్టేషన్లను ఆధునీకరించనున్నట్టు చెప్పారు. రూ. 1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామన్నారు. 5300 కిలోమీటర్ల 44 కొత్త ప్రాజెక్టులకు ఎంవోయులు కుదుర్చుకున్నామని, వాటి ద్వారా 65 వేల అదనపు బెర్తులు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

రైల్వేలో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని సురేష్ ప్రభు చెప్పారు. ఈ-టికెటింగ్ విధానంలో నిమిషానికి 2 వేల టికెట్లు సామర్థ్యం నుంచి 7,200 ల టికెట్లకు పెంచినట్టు చెప్పారు. వన్ టైం రిజిస్ర్టేషన్ చేసుకున్న వారికి ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలుపై రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 100, వచ్చే రెండేళ్లలో మరో 400 రైల్వే స్టేషన్లకు వైఫై, ఎస్కలేటర్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. టికెట్ల బుకింగ్ కోసం మొబైల్ యాప్ అందుబాటులో ఉందన్నారు. 1780 ఆటోమేటిక్ టికెట్ విక్రయ యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులు కన్సెషన్ టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. విదేశీ డెబిట్, క్రెడిట్ కార్డులతోనూ ఈ-టికెట్ కొనుగోలు చేసే అవకాశం ఇస్తామని చెప్పారు.

అన్ని రైల్వేస్టేషన్లలో డిస్పోజబుల్ బెడ్ రోల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్వచ్ఛ భారత్ కింద ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రైళ్లలో 17 వేల బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని, 475 రైల్వే స్టేషన్లలో బయో టాయిలెట్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి ఇండియన్ రైల్వే అభివృద్ధి పరిచిన బయో వాక్యూమ్ టాయిలెట్ ను దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఉపయోగిస్తామన్నారు. నాన్ ఏసీ కోచ్ లలో డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. లోయర్ బెర్తులలో వయోవృద్ధులకు రిజర్వేషన్ కోటాను 50 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనివల్ల ఒక్కో రైల్లో 120 బెర్తులు వారికి అందుబాటులో ఉంటాయన్నారు.

గుజరాత్ లోని వడోదరలో ఉన్న రైల్వే ఇనిస్టిట్యూట్ ను రైల్వే యూనివర్సిటీగా మారుస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది 311 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైల్వే ప్రమాదాల నివారణకు, బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్, కొరియా దేశాల సహకారం తీసుకుంటామని చెప్పారు. తక్కువ శబ్ధం ఎక్కువ సౌకర్యం ఉండేలా కొత్త కోచ్ లు నిర్మిస్తామన్నారు. పరిశుభ్రమైన దుప్పట్లు అందించడం కోసం మెకనైజ్డ్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు.

వారణాసి-ఢిల్లీ మధ్య కొత్తగా మహామన ఎక్స్ ప్రెస్ ఆధునిక రైలును ప్రారంభిస్తున్నట్టు రైల్వే మంత్రి చెప్పారు. కొత్తగా హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తామన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శన కోసం డబుల్ డెక్కర్ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. దూర ప్రయాణం చేసే రైళ్లకు రెండు నుంచి నాలుగు అన్ రిజర్వుడ్ దీనదయాల్ కోచ్ లను జోడించనున్నట్టు చెప్పారు. రద్దీ ఉండే లాంగ్ రూట్లలో సామాన్యుల కోసం అన్ రిజర్వుడ్ అంత్యోదయ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. 130 కిలోమీటర్ల వేగంతో తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడపనున్నట్టు ప్రకటించారు.

రైళ్లలో స్థానిక వంటకాలకు ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. 408 స్టేషన్లలో ఈ కేటరింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. క్లీన్ మై కోచ్ పేరుతో ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. టికెట్లపై ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైల్వేస్టేషన్లలో సౌకర్యాల పెంపునకు ఫండ్స్ ఇచ్చేందుకు 121 మంది ఎంపీలు అంగీకరించారని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం ప్రమాదాలు తగ్గాయని రైల్వే మంత్రి చెప్పారు.