రైస్‌ మిల్లుల ధూళితో ప్రజల అవస్థలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (): ఖమ్మం పట్టణం శివారు ప్రాంతమైన శ్రీరాంనగర్‌లోని రైస్‌ మిల్లులతో స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ మిల్లుల నుంచి వచ్చే బూడిద, వరిపొట్టు వంటి వ్యర్థ పదార్థాలు, దుర్వాసనలతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బూడిద నియంత్రించకపోవడంతో చిమ్నీలు, పొగగొట్టాల నుంచి వచ్చే ధూళి, దుమ్ము, బూడిదను నివారించకపోవడంతో చుట్టు ప్రక్కల గ్రామాస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బూడిదతో కూడిన గాలిని పీల్చడం వలన  ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల నుంచి వదులుతున్న వ్యర్థ  పదార్థాలు, జలాలతో  భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వాపోతున్నారు. వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని నిరోధించి కాపాడాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు.