రొహింగ్యాల ఊచకోత ఆపండి1.రొహింగ్యాల ఊచకోత ఆపండి

-సుష్మాస్వరాజ్‌ ద్వారా మయన్మార్‌ చర్యలను నిరసించిన మహమూద్‌ అలీ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బృందం
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):మయన్మార్‌లో రొహింగ్యాలపై జరగుతున్న సామూహిక మారణకాండ దారుణమని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఆయన శువ్రారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ను ఎంపి కె కేశవరావు, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారిలతో కలిసి సమావేశమయ్యారు.శుక్రవారం ఢిల్లీలోని జవహార్‌ భవన్‌ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ను తెలంగాణ రాష్ట్ర          ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఎంపి కె కేశవరావు, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి కలిసారు. మయన్మార్‌ రోహింగ్యాలపై జరుగుతున్న హింసాకాండను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మయన్మార్‌ లో రోహింగ్యాలపై జరుగుతున్న అత్యాచారాలు, మత దాడులతో, ఇండియాలోని రోహింగ్యాలు సైతం ఆందోళన చెందుతున్నారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మయన్మార్‌ లో రోహింగ్యాలకు రక్షణ కల్పించేలా విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టాలని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడి దృష్టికి రోహింగ్యాల అంశాన్ని తీసుకెళ్లాలని సూచించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధాని  నరేంద్ర మోడి అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తగలిగితే, రోహింగ్యాలకు రక్షణ కల్పించేలా మయన్మార్‌, బంగ్లాదేశ్‌ చర్యలు చేపడతాయని ఆశా భావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం సౌది అరేబియా రాయబారి ని, బంగ్లా దేశ్‌ హైకమిషనర్‌  ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో కొత్తగా సౌది అరేబియా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సౌది అరేబియా రాయబారిని కోరామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సౌది అరేబియా రాయబార కేంద్రానికి కావాల్సిన స్థలం విషయంలో ప్రభుత్వం సుముకంగా ఉందని, హైదరాబాద్‌ లో సౌది అరేబియ రాయబార కేంద్రం ఏర్పాటు చేస్తే, అది తెలంగాణ తో పాటూ, దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి సౌది వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా ఘననీయంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇదే సందర్బంగా మయన్మార్‌ లో  రోహింగ్యాలపై జరుగుతున్న దాడులపై ఇరు దేశాల రాయబారులతో చర్చించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రోహింగ్యాలను బంగ్లాదేశ్‌ లోకి అనుమతించేలా  చర్యలు చేపట్టాలని బంగ్లా దేశ్‌ హైకమిషనర్‌ ను కోరినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.