రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేసిన బిచ్చగాడు
ఆసక్తిగా తిలకించిన ప్రజలు
భోపాల్,డిసెంబర్21( జనం సాక్షి): ఆకాశం నుంచి డబ్బులు పడితే ఎంత బాగుంటుందోనని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజజీవితంలో అలా జరిగితే అది విచిత్రమే అవుతుంది. అలాంటి ఒక విచిత్రమైన వీడియో ఒకటి సోషల్ విూడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక వృద్ధుడు కరెన్సీ నోట్లను రోడ్డుపై విచ్చలివిడిగా ఎగరేస్తూ కనిపించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో జరిగింది. ఉజ్జయిని నగరంలోని నాగదా రైల్వే స్టేషన్ బయట సోమవారం ఒక వృద్ధుడు రూ.100, రూ.50 కరెన్సీనోట్లను గాల్లో ఎగిరేస్తున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు ఇది చూసి నివ్వెరపోయారు. వారిలో ఒక ప్రయాణికుడు ఆ వృద్ధుడి చేసే పనిని వీడియోగా రికార్డ్ చేశారు. ఆ తరువాత ఒక సంచిలో నుంచి రూ.10, రూ.20 నోట్లను కూడా తీసి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై విసిరేశాడు. విచిత్రం ఏమిటంటే అక్కడున్న వారెవరో ఆ నోట్లను ముట్టుకోలేదు. పైగా ఆ ముసలి వ్యక్తికి అలా చేయవద్దని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను మతి స్థిమితం లేనట్టు ప్రవర్తించాడు. ఆ నోట్లతో పాటు అతని సంచిలో నుంచి కొన్ని ఆస్తి పత్రాలు కూడా జారిపడుతున్నట్లు కనిపించాయి.