రోడ్డు పక్కన రైతుబతుకు..
వారు బురద చిమ్మితేనే మనకు మెతుకు
– సమస్యల పరిష్కారానికి సర్కారు జాప్యం
– దేశవ్యాప్తంగా జనాగ్రహం
ఢిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల కారణంగా కనీస మద్దతు ధర, మండీల వ్యవస్థ రద్దయిపోతుందంటూ వివిధ రైతు సంఘాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో తమ నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చే ఎలాంటి సవరణనూ తాము అంగీకరించబోమనీ.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిరసనలకు దేశవ్యాప్తంగా ప్రజలకు నుంచి విశేష మద్ధతు లభించింది.ఇదిలాఉండగా యూపీకి చెందిన కిసాన్ మజ్దూర్ సంఘ్ సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనకు కేంద్రం తలొగ్గరాదంటూ వినతి పత్రం అందజేశారు. ఇవాళ కిసాన్ మజ్దూర్ సంఘ్‌కి చెందిన దాదాపు 60 మంది రైతులు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తోమర్ స్పందిస్తూ.. నూతన వ్యవసాయ చట్టాలకు ఎలాంటి సవరణలు చేయరాదని సదరు రైతు సంఘం కోరినట్టు వెల్లడించారు. ”కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా బాఘ్పత్‌కి చెందిన రైతులు లేఖ అందజేశారు. కేంద్రం ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గరాదనీ.. వ్యవసాయ చట్టాలకు సవరణ చేయరాదని వారు కోరారు..” అని తోమర్ తెలిపారు.కాగా ఇటీవల యూపీ, కేరళ, తమిళనాడు, బీహార్, హర్యానాకి చెందిన దాదాపు 10 రైతు సంఘాలు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. తేదీని ఖరారు చేసుకొని రైతులు చర్చలకు రావాలన్నారు.వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామంటూ కేంద్రం పదేపదే చెబుతుండటం ఆపాలని, అది అర్ధరహితంగా ఉందని రైతు సంఘాల నేతలు బుధవారం అన్నారు. కేంద్రం ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను తిరస్కరించిన విషయం తెలిసిందే. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమేనంటూ రైతులు స్పష్టంచేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాయడం గమనార్హం.