రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి

లక్సెట్టిపేట: పట్టణంలో ఆంధ్రా కాలనీలో సోమవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సలీంఖాన్‌ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై షేక్‌ లతీష్‌ ఇచ్చిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం కాశీపేటకు చెందిన సలీంఖాన్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మంచిర్యాలకు కిరాయి కోసం వెళ్లిన అతను పని ముగించుకోని రాత్రి రెండు గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా ఆంధ్రా కాలనీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనం లైట్ల వెలుగుకు ఆటోను ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న బోర్డును ఆటో ఢీకొట్టింది. ఆటో ముందుభాగంలోని అద్దాలు పగిలి సలీంకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు హైమద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.