రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కేశ్వాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తగూడెం కూలీలైస్‌కు చెందిన వెంకన్న కుటుంబం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఇన్నోవా కారు కేశ్వాపురం వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కార్తీక్‌, కోళ్ల కీర్తన తీవ్రంగా గాయపడగా.. వెంకన్న, ఉమాశంకర్‌, మౌనిక,లక్ష్మీ, ఆటోడ్రైవర్‌, నర్సిహంరావు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని కొత్త గూడెంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా కార్తీక్‌(2), కీర్తన(13) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.