రోడ్డు ప్రమాదంలో HCU విద్యార్థిని మృతి
ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం సంభవించింది. బూర్జుగడ్డ వద్ద మంగళవారం తెల్లవారుజామున కారు బోల్తా కొట్టిన ఘటనలో అనన్య అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోన్న అనన్య తన స్నేహితులతో కలిసి హ్యుందాయ్ ఐ20 కారు(టీఎస్ 09 ఈఎస్ 5257)లో ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్ నుంచి షాద్‌నగర్ వైపునకు వెళ్లే క్రమంలో బూర్జుగడ్డ వద్ద కారు బోల్తా కొట్టింది. కారు అమాంతం ఎగిరిపడటంతో తీవ్రంగా ధ్వంసమైంది.మృతురాలు అనన్య స్వస్థలం ఉత్తరప్రదేశ్ అని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మరణవార్తతో హెచ్‌సీయూలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబీకులకు సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. అనన్య మరణవార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.