రోడ్డు మధ్యలో కట్టడాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే

రోడ్డు మధ్యలో ప్రార్థనా మందిరాలు ఉండాల్సిందేనా..? వాటిని అలాగే కొనసాగించడం ఎంతవరకు సబబు. గతంలోనే సుప్రీం ధర్మాసనం దీనిపై ఓ నిర్ణయం వెలువరించింది. ఇష్టం వచ్చినట్లుగా విగ్రహాలు పెట్టడం, వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను కొనసాగించడం ఎంతవరకు సబబు అన్నది ఆలోచన చేయాల్సిన ఆగత్యం ఇప్పుడు ఏర్పడింది. విజయవాడలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని ప్రార్థనామందిరాల తొలగింపు ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతోంది. అయితే గతంలో సుప్రీం తీర్పుకు లోబడి, ఇప్పుడు ధార్మికవేత్తల సూచనలు తీసుకుని అడ్డంగా ఉన్న వాటిని తొలగించడమే న్యాయం. వీటిని తొలగించి ప్రత్యామ్నాయ స్థలాల్లో నెలకొల్పుకునేలా కఠిన చర్యలు తీసుకోకుంటే అవి అభివృద్ధికి అడ్డంకిగా మారగలవు. ఎపిలో తొలగింపు వ్యవహారంలో హిందూ మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంలో నిజాయితీ ఉంది. వాటిని తొలగించే ముందు సంప్రదించి ప్రత్యామ్నాయాలు సూచించి ఉంటే బాగుండేది. అలాగే ఒకే మతానికి చెందినవే తొలగిస్తున్నారన్న అపోహలు పోవాలి. రోడ్డువిూద ప్రార్థనామందిరం ఎవరిదైనా, దర్గాలు ఉన్నా, విగ్రహాలు ఉన్నా తొలగించాల్సిందే. అప్పుడే సమన్యాయం పాటించన వారం అవుతాం. ఇది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. ఒక్క ఎపికే ఇది వర్తిస్తుందన్నది కాకుండా జాతీయ విధానం రావాలి. కేంద్రమే దీనిపై సమగ్రమైన చట్టం చేయాలి. లేకుంటే రోడ్డుమధ్యలో ఇష్టం వచ్చినట్లుగా ఉండే ప్రార్థనామందిరాలతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో వీటి జోలికి పోకుండా వాటిని అలాగే వదిలేయడం సరికాదు. అభివృద్ధి పనుల కోసం సంప్రదాయరీతిలో కార్యకలాపాలను పూర్తి చేసి ఆలయాలను తొలగిస్తే ఆక్షేపణ చెప్పాల్సిన అవసరం లేదని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయరు స్వామి చేసిన సూచన ఆహ్వానించదగ్గదిగా ఉంది. ఒక ఆలయాన్ని ఏదో ఒక అభివృద్ధి పనికి వేరే చోటుకు మార్చాలనుకుంటే.. అంతకు ముందుగా చేయాల్సిన అన్ని శాస్తోక్తమ్రైన పక్రియలు పూర్తి చేసి మార్చాలని జీయర్‌ చెప్పారు. తొలగించేటప్పుడు అది హిందూ… ముస్లీం… కైస్త్రవ దేవాలయాలా?ప్రార్థనా మందిరాలా.. అని చూడకుండా, అందరికీ ఒకే రకమైన న్యాయాన్ని చేయగలిగితే అప్పుడు ఆక్షేపణ చెప్పాల్సిన అవసరం లేదని వివరించారు. అలాకాకుండా ఒంటెద్దు పోకడగా హిందూ దేవాలయాలను కూలుస్తాం.. మిగతావన్నింటినీ కూల్చం అంటే.. తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చినజీయరు స్వామి పేర్కొన్నారు. ఇది ధర్మబద్దంగా ఉంది. ఎవరిదైనా తొలగించి పునర్నిర్మించే ప్రక్రియను ప్రభుత్వమే చేపట్టాలి. ఇందులో కులమతాలకు, ప్రాంతాలు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఆక్షేపణలు ఉండరాదు. హైదరాబాద్‌ను తీసుకుంటే అడుగడుగునా రోడ్డుపై చిన్నచిన్న గుళ్లు, దర్గాలు వేలల్లో ఉంటాయి. ఇవన్నీ ఇలాగే కొనసగించడం ఎక్కడి ధర్మం. ఇక ఉస్మానియా యూనివర్సిటీ అంతా స్మశానంగా మారుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఖాళీస్థలంలో శవాలను పాతిపెట్టి వాటిని దర్గాలుగా చేస్తున్నా యూనివర్సిటీ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో క్యాంపస్‌ ఖాళీస్థలాల్లో పదుల సంఖ్యలో దర్గాలు వెలిసాయి. దీనికి ఎవరు బాధ్యలు. ఇలా అక్రమంగా చోటుచేసుకున్న నిర్మాణాలను తొలగించాల్సిందే. హైదరాబాద్‌ రోడ్లపై ఉన్న ప్రార్థనామందిరాలు పూర్తిగా తొలగించాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలా వేల సంక్యలో రోడ్డు మధ్యలో వెలసిన కట్టడాలను తొలగించాల్సిందే. విజయవాడలో జరిగిన ఘటనపై స్వావిూజీలు ఆగ్రహం చెందారు. ఎందుకంటే ఇక్కడ కేవలం హిందూ ఆలయాలను మాత్రమే తొలగించడం వల్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాకాకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రార్థనామందిరాలను తొలగిస్తామని చెప్పివుంటే ఇంతగా రభస జరిగేది కాదు. ఇకముందు అలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూడాలి. అలా చేయకుంటే రోడ్డు విస్తరణకు సంబంధించి లక్ష్యం నెరవేరదు. హిందూ దేవాలయాలను, ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు అందుకు విఘాతం కలిగిస్తే సహించబోమని పలువురు స్వావిూజీలు హెచ్చరించారు. దేవాలయాలపై దాడులను ఆపాలని నినదిస్తూ కెనాల్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. అయితే ఒక్క హిందూ ఆలయాలు తొలగించడం వల్లనే ఇలా జరిగిందని చంద్రబాబు గుర్తించి, అలాకాకుండా అన్ని ప్రార్థనా మందిరాలకు ఇదే వైఖరి ఉంటుందని నిరూపించుకోవాలి. లేకుంటే స్వావిూజీల ఆగ్రహానికి నిజంగానే గురికాకతప్పదు. ఇకపోతే అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన వివిధ మతాలకు చెందిన ప్రార్ధనా మందిరాల తొలగింపు వ్యవహరాన్ని ఎవరు కూడా రాజకీయాలకు వాడుకోరాదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి అడ్డంకిగా ఉన్న ఏ ఆక్రమణలనైనా ఎవరు అధికారంలో ఉన్నా తొలగించడం సర్వసాధారణ ప్రక్రియగా భావించాలి. దీనికి సమగ్రమైన కఠిన చట్టం తేవాలి. తొలగింపు పక్రియ ఆయా వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. పరస్పర సంప్రదింపులతో ఒప్పించి మెప్పించాల్సిన బాధ్యత సర్కారుదే. విజయవాడలో ప్రభుత్వం తొలగిస్తున్న ప్రార్ధనా మందిరాల్లో కేవలం హిందువుల దేవాలయాలే ఉన్నాయన్న వాదన ఉంది. అన్ని వర్గాలకు చెందినవి ఉంటే ప్రభుత్వం ప్రకటనచేయాలి. చర్చిలు, మసీదులు, దర్గాలూ ఉన్నా తొలగిస్తామని ప్రకటించాలి. అప్పుడే ఏ వర్గం కూడా అల్లరి చేయడానికి సాహసించదు. రోడ్లకు అడ్డంగా ఉన్న కట్టడాలను దుబాయ్‌ లాంటి దేశాల్లోనే తొలగించగా మనకు అడ్డంకులు ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఇక ఆలస్యం చేయకుండా గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును స్ఫూర్తిగా తీసుకుని ఆయా రాష్టాల్రు ముందుకు సాగాలి. ఇందుకు కఠిన వైఖరి అవలంబించాలి. ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు తావు లేకుండా చట్టం చేయాలి.