రోడ్డెక్కిన రేకుర్తి
` ఆపిన రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి
` తప్పుడు నివేదికలిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలి
` వందలాది మంది బాధితుల డిమాండ్
కరీంనగర్ బ్యూరో (జనంసాక్షి) :కరీంనగర్ శివారులోని రేకుర్తి గ్రామంలో ఆగిన రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని వందలాది మంది బాధితులు రోడ్డెక్కారు. ఏండ్ల తరబడి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ స్పందించి రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రేకుర్తి శివారులోని భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు 1 నుంచి 230 వరకు ఉన్నాయి. ఈ మొత్తం సర్వే నెంబర్లు కలెక్టర్ ఆదేశాల మేరకు దాదాపు 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో గ్రామానికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భూముల్లో ఇప్పటికే గ్రామస్తులు గ్రామ పంచాయతీ, పురపాలక సంఘం అనుమతులతో 80శాతం ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ ఇండ్లకు ఇంటి పన్ను, అన్నిరకాల పన్నులు, గృహ రుణాలు కొన్ని సంవత్సరాల నుంచి చెల్లించుకున్నారు. ఇంతకు ముందు కలెక్టర్ ఆదేశాలకు పూర్వం ఈ భూములన్నీ సబ్ రిజిస్ట్రార్ కరీంనగర్, గంగాధరలో రిజిస్ట్రేషన్లు కాబడ్డాయి. వాటన్నింటినీ అప్పటి ఎమ్మార్వో, ఆర్డీవోలు తమ పేర్ల మీద రెవెన్యూ రికార్డుల్లో జమాబందీ చేశారు. అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. భూములు అమ్ముకోలేక చాలా పెండ్లీలు ఆగిపోయాయి. ఇలాగే కొనసాగితే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని, కలెక్టర్ వెంటనే స్పందించి రేకుర్తిలో ఆపిన రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని కోరారు.. అదేవిధంగా 22ఏ కింద పెట్టిన పట్టా సర్వే నెంబర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, పాశం మోహన్ రెడ్డి, జాడి బాల్‌రెడ్డి, ఎంఎ రహీం, అందె శ్యాంసుందర్, ఆకుల కృష్ణ, టైగర్ శ్రీనన్న, బాయిల్ వర్మ, రవీందర్, నరేందర్, డి రవీందర్, కొలిపాక శ్రీనివాస్, గొల్లె తిరుపతి, రేకుర్తి గ్రామ ప్రజలు, దాదాపు 200 మంది బాధితులతో పాటు వినేశ్, కార్తిక్, రాజగోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఈరవేణి అంజయ్య, వడ్ల అంజయ్య, మూడావపు శ్రీనివాస్, రవీంద్రాచారి, అజిత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


