రోడ్ల తవ్వకాలతో అస్తవ్యస్థం
కరీంనగర్,ఆగస్ట్28: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద కోట్లు ఖర్చు
చేసి రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. వేసిన రోడ్లను వేసినట్లే తవ్వేస్తున్నారు. ఓ వైపు తారు, సీసీ రోడ్డు వేస్తుండగా.. మరోవైపు ఇతర పనుల పేరుతో తవ్వుతుండటంతో ఆ రోడ్లు మళ్లీ మొదటికొస్తున్నాయి. ఏడాది తిరగకముందే వివిధ అవసరాల కోసం రోడ్డు తవ్వుతుండటంతో ఎప్పటిలాగే గుంతలు తయారవుతున్నాయి.రెండేళ్లుగా నగరంలోని పలు డివిజన్‌లలో తారు, సీసీ రోడ్లు వేయగా ఇష్టానుసారంగా తవ్వి వదిలేస్తుండటంతో లక్షలు ఖర్చు చేసిన రోడ్లు పాడవుతున్నాయి. అయితే భూగర్భ డ్రైనేజీ పనుల కోసం కాకుండా తాగునీటి పైపులైన్లు వేయడానికి, ఇంటికి కొళాయి కనెక్షన్ తీసుకోవడానికి, టెలిఫోన్ కేబుల్స్ వేసుకోవడానికి, మురుగు కాల్వల కోసం తవ్వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏడాది తిరగకముందే ఎడాపెడా తవ్వుతున్నా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు దాదాపు పూర్తి చేశారు. వీటికి రోడ్డు మధ్యలో ఛాంబర్లు నిర్మించి ఇంటింటా కనెక్షన్లు ఇచ్చేందుకు ఇన్‌స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఆ పనులు చేయాలంటే రహదారి మొత్తం తవ్వాల్సిందే. ఈ పనులు పూర్తయిన చోటనే సీసీ రోడ్లు, తారు రహదారి పనులు
చేయాల్సి ఉండగా అవేవీ పట్టించుకోకుండా నగరపాలక అధికారులు చకచకా చేస్తూ చేతులు దులుపు కొంటున్నారు. కోట్లు వెచ్చించి కొత్తగా రహదారుల నిర్మాణం చేపడు తున్నారు. కొత్తగా నిర్మించే రహదారులను పకడ్బందీగా చేస్తున్నారు. కొన్ని డివిజన్‌లలో భూగర్భ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా చేపట్టగా ఆ పనులు పూర్తి కాలేదు. రోడ్డు మధ్యలో వేసే మ్యాన్¬ల్స్, ఇంటికి మధ్య ఇన్‌స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉంటుంది. భూగర్భ డ్రైనేజీకి సంబంధించి రోడ్డు మధ్యలో పైపులు వేయని ప్రాంతాల్లో పైపులు వేయకుండానే రోడ్లు వేస్తున్నారు.పాతికేళ్ల వరకు భద్రంగా ఉంటాయన్న రహదారులు ఏదో ఒక పనిపేరుతో తవ్వుతుండటంతో నిధులు నేలపాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రణాళికబద్ధంగా పనులు చేయకపోవడమే అన్న విమర్శలు ఉన్నాయి.