రోడ్ల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): లోడు లారీల కారణంగా రోడ్లు ధ్వంసంకావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల మూలంగా రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  దుమ్ముతో తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహించారు. ఈ మేరకు  కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  సిరిసిల్ల మండలం కొదురుపాక నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్‌ సవిూపంలోని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు ఇసుక తరలిస్తున్న లారీల కారణంగా రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్థులు అంటున్నారు. గత కొంతకాలంగా ఇసుక, కంకర లోడుతో వెళ్తున్న లారీలతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వారు వాపోయారు. ఆ దుమ్ముతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులు మరమ్మతులు చేస్తామని హావిూ ఇచ్చినా మార్పు రావడం లేదన్నారు.