రోశయ్యను విస్మరించడం కుసంస్కారం

సిఎం జగన్‌ తీరుపై మండిపడ్డ తులసిరెడ్డి
అమరావతి,మార్చి9(జనం సాక్షి): మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్యకు ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళులర్పించక పోవడం గర్హనీయమని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి అన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి జగన్‌ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. రోశయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్సీగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారన్నారు. 15సార్లు రాష్ట్ర బ్జడెట్‌ను ప్రవేశపెట్టి రికార్డ్‌ సృష్టించిన గొప్ప ఆర్థికవేత్తని కొనియాడారు. అంతటి మహోన్నతుడిని స్మరించకపోవడం దారుణమన్నారు. ఇది క్షమించరాని విషయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి సంతాప తీర్మానం పెట్టాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇకపోతే మహిళా సాధికారిత పట్ల వైసీపీ నాయకులు డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని తులసి రెడ్డి అన్నారు. సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీతకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్ర మహిళలకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. మహిళా సాధికారిత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలన్నారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదన్నారు. జగనన్న తాలిబొట్లు తాకట్టు పెట్టే పథకంగా తయారయిందన్నారు. అంగన్‌వాడి, ఆషా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పెళ్ళికానుక పథకాన్ని అమలు చేయాలని, బంగారు తల్లి, అమ్మహస్తం పథకాలను పునరుద్ధరించాలని తులసి రెడ్డి డిమాండ్‌ చేశారు.