రోస్టర్ పద్దతిలో ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ
వచ్చే ఏడాది నుంచి కేజీ నుంచి పీజీ విద్య
మూడు నెలల్లో అన్ని వర్శిటీల వీసీలను నియమిస్తాం
గురుపూజోత్సవంలో మంత్రి కడియం వెల్లడి
హైదరాబాద్,సెప్టెంబర్5(జనంసాక్షి):
తెలంగాణలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. పలుచోట్ల గురువులకు సత్కారం చేశారు. వారిని శాలువాలతో కప్పి సత్కరించారు. వారికి సత్కారాలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ప్రభుత్వం తరఫున పలువురు టీచర్లను శాలువాలతో సత్కరించారు. వారికి అవార్డులు,నగదు బహుమతులు అందచేశారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో త్వరలో సమూల మార్పులు రానున్నాయని చెప్పారు. అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. త్వరలోనే అవి కార్యరూపం దాల్చనున్నాయని ప్రకటించారు. సామాజిక రుగ్మతలతో పాటు జీవన ప్రమాణాలు మారాలంటే విద్య ఒక్కటే పరిష్కారమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రోస్టర్ విధానంలో ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ చేయనున్నట్లు కడియం శ్రీహరి పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టూ పీజీ విద్యను అమలు చేయనున్నామని, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ తరహా విధానంలో కేజీటూపీజీ విద్యను అందిస్తామని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రయోగాత్మకంగా ఉచిత విద్యకు పాఠశాల ఎంపికను చేపడుతామన్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించేలా కొత్తగా 1,190 గురుకులాలను ఏర్పాటు చేస్తాం. 3 నెలల్లో అన్ని విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తామన్నారు. ఒప్పంద అధ్యాపకులను రోస్టర్ విధానంలో క్రమబద్ధీకరిస్తాం. రేషన్‌లైజేషన్, బదిలీల తర్వాత 8 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడుతామని చెప్పారు. 8 వేల మంది విద్యావలంటీర్లను త్వరలోనే నియమిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను మంత్రులు కడియం శ్రీహరి, మహ్మమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సత్కరించారు. శాలువా, మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉత్తమ టీచర్లకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మరో డిప్యూటి సిఎం మహ్మూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.