రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నగరం అగ్నిగోళంలా మారింది. నిప్పుల కుంపటిని ఇంట్లో పెట్టుకున్న మాదిరి భగభగలు నిలువనీయడం లేదు. సూర్యతాపం దెబ్బకు 44 ఏళ్ల రికార్డుకు ఎండలు చేరువయ్యాయి. పగటిపూట అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ ఏప్రిల్లోల ఇదే
మొదటి సారి.  సాధారణంగా ఈ సమయంలో 38.1 డిగ్రీలు నమోదుకావాలి. దాదాపు ఐదు డిగ్రీలు ఎక్కువగా ఎండ తీవ్రత జనాన్ని ఉడికిపోయేలా చేసింది. క్రితం ఏడాది ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత పదేళ్ల రికార్డుగా ఉంది.  ఎండల తీవ్రత చూస్తే అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసాధారణ ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.