రోహిత్‌, జేఎన్‌యూ వివాదంపై దద్దరిళ్లిన పార్లమెంట్‌

CA
– వర్సిటీలపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలన్ని రుద్దుతున్నారు

– అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నామంటూనే దళిత విద్యార్థులపై అత్యాచారాలు

– జ్యోతిరాధిత్య సింధియా

– మండిపడ్డ సృతీఇరానీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):  రోహిత్‌, జేఎన్‌యూ వివాదాలపై పార్లమెంట్‌ దద్ధరిళ్లింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ… విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులపై చర్చించాలని పట్టుబట్టారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ… అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా స్పష్టం చేశారు. అనంతరం సభాపతి సుమిత్రామహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇదిలావుంటే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్ది రోహిత్‌ ఆత్మహత్య ఘటన రాజ్యసభను కుదిపేసింది. విపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాజ్యసభకు ఆటంకం కలిగించాయి. కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ అజాద్‌ రోహిత్‌ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు. బిఎస్పి అధినేత్రి మాయావతి ఈ అంశాన్ని గట్టిగా తీసుకున్నారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ వారిస్తున్నా,ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శల వర్షం కురిపించారు.  రోహిత్‌ ఆత్మహత్య బాధాకరమని , కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థులను అణచివేస్తున్నారని మాయావతి ఆరోపించారు. సెంట్రల్‌ వర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. దళిత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం సమాధానం చెప్పాలని ఆమె పట్టుబట్టారు. దీనిపై కొంతసేపు సభలో గందరగోళం జరిగింది. తర్వాత అధికార పక్షం కూడా చర్చకు తాము తక్షణం సిద్ధమని చెప్పడంతో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ చర్చకు అనుమతించారు. కానీ, మాయావతి మాత్రం చర్చ విషయాన్ని పట్టించుకోకుండా.. ప్రభుత్వం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వదని అడిగారు. చర్చ జరిగితే.. ఆ తర్వాత ప్రభుత్వం దానికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందేనని కురియన్‌ చెప్పినా.. మాయావతి, ఆమె పార్టీ సభ్యులు వినిపించుకోలేదు. బీఎస్పీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళం రేగడంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విపక్షాలపై విరుచుకుపడుతూ కేవలం రాజకీయ లబ్ది కోసమే లేనిపోని అభాండాలు మోపుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనలకు, బిజెపికి ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు.ఈ వివాదాలు,గొడవల మధ్య రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది.  రాజ్యసభ ప్రారంభమైన వెంటనే బీఎస్పీ నేత మాయావతి మాట్లాడుతూ… హెచ్‌సీయూలో దళిత విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. హెచ్‌సీయూ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు బృందంలో దళిత సభ్యులే ఉండాలని కోరారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇదే అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడాలని డిప్యూట్‌ ఛైర్మన్‌ వారించినా మాయావతి శాంతించలేదు. మాయావతికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ బీఎస్పీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.   రోహిత్‌ ఆత్మహత్యను రాజకీయ లబ్దికి వాడుకుంటున్నాయని మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా.. చర్చ పెట్టండి అన్నీ తెలుస్తాయ అని మండిపడ్డారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యతో ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ మృతిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.  సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ… విచారణ బృందంలో దళిత సభ్యుడు ఉండాలని కోరారు. విచారణ బృందంలో దళిత సభ్యుడు ఉంటున్నారో లేదో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గందరగోళం కారణంగా సభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఐదోసారి సభ వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని బీఎస్పీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుండగా ఎటువంటి దేశ వ్యతిరేక చర్యలనైనా సహించమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ వ్యతిరేక చర్యలకు కొందరు మద్దతు పలకడం తీవ్రంగనాఏ పరిగణిస్తామని అన్నారు. జేఎన్‌యూ,హెచ్‌సీయూలలో ఘటనలపై ఆయన పార్లమెంట్‌లో మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో కొంత మంది మావోయిస్టు భావాలతో ఉన్నారన్నారు. వారే మంచివారిని చెడగొడుతున్నారని అన్నారు. అఫ్జల్‌ గురు, మక్బూల్‌భట్‌, యాకూబ్‌ మెమెన్‌ తదితరులకు మద్దతివ్వటం జాతి వ్యతిరేకమే అన్నారు. ఇది దేశహితంగా పరిగణించాలా అని అన్నారు. వారి భావజాలం మంచిదో కాదో ప్రజలే తేలుస్తారన్నారు. ఈ  సందర్భంగా బీఆర్‌ అంబేడ్కర్‌ మాటలను ఆయన చదివి వినిపించారు. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదన్నారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వాటిని సమర్థించమన్నారు. ఇవేవీ ఏ ఒక్కరి వ్యక్తిగత విషయాలు కాదన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఘటనల వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు.ఇదిలావుంటే రాహుల్‌పై బిజెపి అధ్యక్షుడుఅమిత్‌షా మండిపడ్డారు. అఫ్జల్‌ గురుకు అనుకూలంగా, జాతి వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు చేసిన నినాదాల్ని సహించమంటారా.. ఈ విషయంలో స్పష్టతనివ్వండి… అని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా రాహుల్‌ గాంధీని కోరారు. కాంగ్రెస్‌ని తాను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నానని చెప్పారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని షా విమర్శించారు. వాక్‌ స్వాతంత్య్రం పేరుతో అలాంటి జాతి వ్యతిరేక వ్యాఖ్యల్ని సహించడం సరైనదో కాదో కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంటులో తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని.. అందుకే పార్లమెంట్‌లో జేఎన్‌యూ అంశంపై తనను నోరు తెరవనివ్వదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా పై విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే సెక్యులరిజం కాంగ్రెస్‌ పేటెంట్‌ కాదు..జాతీయవాదం బీజేపీ పేటెంట్‌ కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభలో  హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్య ప్రస్తావనపై చర్చించారు.  హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల ఆత్మహత్య మొదటిది కాదన్నారు. గతంలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు..అందుకే మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోహిత్‌ ఆత్మహత్యను రాజకీయం చేయొద్దని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ అంశాన్ని వాడుకోలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే అనేకమంది రాజకీయనాయకులకు తన నియోజకవర్గం రాజకీయ టూరిస్ట్‌ ప్లేస్‌గా మారిందన్నారు. దీనిని రాజకీయం చేయాలని చూశారన్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు ఇలా చేసిన వారు భంగపడ్డారని అన్నారు.

పార్లమెంట్‌లో ‘అసహన’ మంటలు

జేఎన్‌యూ ఘటన, రోహిత్‌ వేముల ఆత్మహత్యపై పార్లమెంటులో వాడీ వేడి చర్చ జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగిస్తూ దేశంలో అసహనం పెరిగిపోతుందని మండిపడ్డారు. జేఎన్‌యూ ఘటనపై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయాలను అనుగుణంగా వున్నామని చెబుతున్న ప్రభుత్వం నిమ్నవర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో విఫలమయిందని ఆరోపించారు. కేంద్రం తన దారి రహదారి అని భావిస్తోందా?అని అన్నారు.జేఎన్‌యూను తప్పుబడుతున్న వారు ఆ సంస్థ నుంచే కేంద్రమంత్రులైన నిర్మలా సీతారామన్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి… తదితరులు విద్యనభ్యసించిన విషయాన్ని గ్రహించాలన్నారు.జేఎన్‌యూ ఆందోళన వెనకు పాక్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ఉన్నాడని కేంద్ర ¬ంమంత్రి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటించాకరి తెలిపారు. జేఎన్‌యూలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారనే వాదనను  ఖండించారు. ఈ చర్చలో భాగంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ప్రొఫెసర్‌ సుగతాబోస్‌, బిజూ జనతాదళ్‌ నుంచి తథాగత శతపథి… తదితరులు ప్రసంగించారు.  ఇదిలావుండగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యవూహంపై ప్రధాని మోడీ సహచర మంత్రులతో చర్చించారు.  ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో సీనియర్‌ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై మంత్రులతో ప్రధాని చర్చించినట్లు సమాచారం. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, సుష్మాస్వరాజ్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.