రోహిత్ మృతికి వీసీ,కేంద్ర మంత్రులదే బాధ్యత
– విద్యార్థులకు భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి
– రోహిత్ తల్లిని పరామర్శించిన రాహుల్
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన దళిత విద్యార్థి మృతికి వీసీ, కేంద్రమంత్రులే బాధ్యత వహించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా బాధించిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. హెచ్‌సీయూలో పర్యటించిన ఆయన రోహిత్ కుటుంసభ్యులు, సహచర విద్యార్థులు, విద్యార్థి నాయకులతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో పక్షపాత ధోరణి కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే వారి కుటుంబాన్ని పరామర్శించే నైతిక బాధ్యత వీసీకి లేదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వ్యక్తి యూనివర్శిటీ లో ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని కలవడం కనీస మర్యాద అని ,కాని విసి కలవలేదని, ఇది యూనివర్శిటీకి అవమానమని రాహుల్ అన్నారు.రోహిత్ చనిపోవడం వల్ల ఆయనకు నష్టం జరిగిందని, అలాగే ఆయన కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అన్నారు. పరిహారం అంటే కేవలం పరిహారం కాదని,గౌరవం ఉండాలని, అతని ద్వారా వారి కుటుంబానికి భవిష్యత్తు ఉండాలని రాహుల్ అన్నారు.ఈ ఘటనకు బాద్యుతలైనవారందరిని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.రోహిత్ కోసం తాను వచ్చానని,ఆయన ఒటరి కాదని, ప్రతి యూనవర్శిటీలో ఇలాంటి వి జరుగుతున్నాయని,వాటిని నిరోధించడానికి తాము అండగా ఉంటామని అన్నారు. విద్యార్దుల రక్షణకు సంబందించి, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిలు లేకుండా ఉండడానికి ప్రత్యేక చట్టం తేవాలని రాహుల్ అన్నారు.కులం,మతం,ఎవరనేదానితో నిమిత్తం లేకుండా భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఉండాలని అన్నారు. తాను విద్యార్దులకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. వీసీ, కేంద్రమంత్రులు సరిగా వ్యవహరించనందువల్లే రోహిత్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. తాను రాజకీయ నాయకుడిగా రాలేదని… విద్యార్థులకు ఎప్పుడు అవసరమైనా అండగా నిలుస్తానని హావిూ ఇచ్చారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. రోహిత్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్దులు తమ భావాలను స్వేచ్చగా వ్యక్తం చేయాలని వ్యాఖ్యానించారు. ఎవరైనా తను చెప్పదలచుకునేది చెప్పగలగాలని, అంతే తప్ప రూపాన్ని బట్టి, వేషభాషలను బట్టి కాదని అన్నారు. ఒకే భావం వ్యక్తం చేయాలని అనుకోవడం కూడా సరికాదని అన్నారు. దీనిని రాజకీయం చేయడం కాదని, కాని ఇక్కడ జరిగిందేమిటి అన్నారు. కొందరు యువకులు తమ భావాలను వ్యక్తం చేయదలిస్తే, యాజమాన్యం వారి భావాలను అణచివేయాలని ప్రయత్నించిందని రాహుల్ అన్నారు. యూనివర్శిటీ పాలకవర్గం,డిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని రాహుల్ అన్నారు. రోహిత్ ఆ ఆవేదనను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. వైస్ చాన్సలర్ ఇక్కడ పదవిలో ఉండడానికి వీలు లేదని రాహుల్ అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ తో కలసి సెంట్రల్ వర్శిటీని చేరుకున్నారు. హెచ్‌సీయూలో రోహిత్ మృతిపై విద్యార్థులతో మాట్లాడనున్నారు. రాహుల్ పర్యటన దృష్ట్యా హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. హెచ్‌సీయూలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ పోలీసులు తనిఖీలు చేసి పంపుతున్నారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఆయన వెంట దిగ్విజయ్‌సింగ్ తదితరులు ఉన్నారు. హెచ్సీయూకు వచ్చిన రాహుల్.. రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చి, హెచ్సీయూలో జరిగిన ఘటనల గురించి అడిగితెలుసుకున్నారు. రాహుల్.. హెచ్సీయూ విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు హెచ్సీయూకు వచ్చారు. ఆందోళన చేస్తున్న విద్యార్దులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ స్మారకార్దం ఏర్పాటు చేసిన స్థూపం వద్ద రాహుల్ నివాళి అర్పించారు. బహిష్కరణకు గురైన దళిత విద్యార్ధులను ఆయన కలిసి వారితో మాట్లాడారు.రాహుల్ వచ్చిన సందర్బంగా విద్యార్దులు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దేశ రాజధాని అట్టుడుకుతోంది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.