రోహిత్‌ సారధ్యంలో ఆసియాకప్‌కు

– ఆసియా కప్‌కు భారత్‌ జట్టు ప్రకటించిన బీసీసీఐ
– కోహ్లీకి రెస్ట్‌… కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ
ముంబయి, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : ఈ నెల15 నుంచి దుబాయ్‌ వేదికగా జరగనున్న ఆసియా కప్‌ కు టీమిండియా రోహిత్‌ సారథ్యంలో బరిలోకి దిగనుంది. శనివారం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే టీమ్‌ ఇండియాకు రోహిత్‌ శర్మ నాయకత్వ వహించనున్నాడు. వరుసగా మూడు ఫార్మాట్లు ఆడుతోన్న భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. శిఖర్‌ ధావన్‌ వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైన హైదరాబాద్‌ ఆటగాడు అంబటి రాయుడు ఆ తర్వాత యో యో టెస్టులో విఫలమై ఆ పర్యటనకు దూరమయ్యాడు. కొద్ది రోజుల క్రితం యో యో టెస్టులో విజయవంతమైన రాయుడు ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన ఖలీల్‌ అహ్మద్‌కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. ఖలీల్‌ రాజస్థాన్‌కు చెందిన వాడు. కోహ్లీతో పాటు హార్దిక్‌ పాండ్యకు కూడా ఆసియా కప్‌ నుంచి విశ్రాంతి ఇస్తారంటూ మొదట వార్తలు వచ్చాయి. కానీ, పాండ్యకు జట్టులో చోటు దక్కింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భువి కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆటగాళ్లపై పడుతోన్న వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చామని, గత కొద్ది కాలంగా అతడు విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. కోహ్లీ విలువైన ఆటగాడని, భవిష్యత్తు టోర్నీలు కూడా దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతి కల్పించాం అని సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. ఆసియా కప్‌లో భారత్‌ తన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
భారత జట్టు ఇలా..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ(వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌.