రౖెెతన్నకు మద్దతుగా… దేశ వ్యాప్తంగా కదం తొక్కిన జనం

 

సంపూర్ణ బంద్‌ తో సంఘీభావం

ఢిల్లీలో కర్షకుల భారీ ర్యాలీ

పంజాబ్‌లో బంద్‌కు ప్రజల అనూహ్య మద్ధతు

రాస్తారోకోలు..ధర్నాలు నిర్వహించిన

రాజకీయ పార్టీలు పలు రాష్ట్రాల్లో భుజం

కలిపిన లెఫ్ట్‌ కార్మిక సంఘాల నేతలు

రైతులకు మద్ధతుగా అన్నాహజారే నిరాహారదీక్ష

 

న్యూఢిల్లీ,డిసెంబరు 8 (జనంసాక్షి): కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌ విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బిజెపియేతర పాలిత ప్రాంత రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్‌ బంద్‌ కొనసాగింది. భారత్‌ బంద్‌లో 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులతో పాటు ఆయా పార్టీల నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పలు రాష్ట్రాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ పొలిమేర్లలో రైతులు కదంతొక్కారు. లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు ఐదు సార్లు కేంద్రంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు బంద్‌కు పిలుపు ఇచ్చారు. కాగా రైతు సంఘాల నేతలతో కేంద్రం బుధవారం మరోసారి చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఇంతవరకు తిరస్కరిస్తూ వచ్చింది. రైతులు సూచించిన సవరణలను చేస్తామని, రద్దు అసాధ్యమని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. పంజాబ్‌లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. అమృత్‌సర్‌లో రైతు, కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. మొహాలీలో టోల్‌ప్లాజాలను అధికారులు మూసివేశారు. ఒడిశాలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఒడిశాలో వామపక్షాలు, కార్మిక, రైతు సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించారు. మహారాష్ట్రలో పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. స్వాభిమాని శెట్కారి సంఘటన రైతు సంఘం ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. బుల్దానా జిల్లా మల్కాపూర్‌ రైల్వేస్టేషన్‌ ట్రాక్‌పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో వామపక్ష శ్రేణులు ప్రదర్శన చేపట్టాయి. కర్ణాటకలో రైతు సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. అగ్రి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. మైసూర్‌లో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. తమిళనాడులోనూ భారత్‌ బంద్‌ కొనసాగింది. అక్కడ డిఎంకె తదితర పార్టీలు మద్దతు పలికి బంద్‌లో పాల్గొన్నాయి. అసోంలోనూ రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణలో.. భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించి.. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు చోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య

సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

రైతులకు మద్దతుగా అన్నాహజారే నిరాహారదీక్ష

పుణె: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌ చేపట్టిన అన్నదాతలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మంగళవారం నిరాహార దీక్షకు దిగారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తన స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో ఒక రోజు దీక్షకు కూర్చున్నారు. ‘గత కొద్ది రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా రైతులు ఆందోళన సాగించడం అభినందనీయం. ఇప్పుడు ఆ ఆందోళనను దేశమంతా చేపట్టాలని యావత్‌ ప్రజలను కోరుతున్నా. ఇందుకోసం రైతులంతా రోడ్డెక్కాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తుంది. అయితే, నిరసనల్లో ఎక్కడా హింసకు పాల్పడకూడదు’ అని అన్నాహజారే వీడియో సందేశం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం జరగాలంటే ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని హజారే అభిప్రాయపడ్డారు. అంతేగాక, అగ్రికల్చరల్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైసెస్‌ కమిషన్‌(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు. ప్రభుత్వం హావిూలే ఇస్తుంది. అంతేగానీ.. వాటిని నెరవేర్చడంలో విఫలమవుతూనే ఉందని హజారే విమర్శించారు.

జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు

భారత్‌ బంద్‌ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ బంద్‌లో రైతు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలతో పాటు పలువురు పాల్గొన్నారు. తాము పిలుపునిచ్చిన బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించిన అందరికీ రైతు సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. మరోవైపు, దిల్లీలో పలు రహదారులపై రాకపోకలు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. మరోవైపు, రైతు సంఘాలు మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ బంద్‌ను విజయవంతం చేసి కేంద్రానికి హెచ్చరిక పంపామని, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ చేస్తోన్న తమ డిమాండ్లు ఎంత న్యాయపరమైనవో చెప్పేందుకు నేటి భారత్‌ బంద్‌కు లభించిన మద్దతే నిదర్శనమని రైతు నేతలు పేర్కొన్నారు.