రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగింది. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్‌బుక్ పేజీలో అప్‌డేట్ చేసింది. మరో 200 మంది రష్యా సైనికుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దీనికి తోడు 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్‌లను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ సమాచారాన్ని ఎవరూ ద్రువీకరించలేదు. ప్రస్తుతం జరుగుతున్న దాడిలో మృతులకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడించలేదు.
ఉక్రెయిన్‌పై మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. నల్ల సముద్రం నుంచి రష్యా తన క్షిపణులను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయి. రష్యా దళాలను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటున్నట్లు పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి. కీవ్ నగరం వద్ద రష్యా బలగాలకు ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. దీంతో అక్కడ హోరాహోరీ పోరు సాగుతోంది. వీలైనంత త్వరగా విక్టరీ సాధించాలనుకుంటున్న రష్యా ఈ నేపథ్యంలో భారీ దాడికి ప్రయత్నిస్తోంది.