లండన్‌ అండర్‌గ్రౌండ్‌ రైలులో పేలుడు

లండన్‌,సెప్టెంబర్‌ 15,(జనంసాక్షి): లండన్‌లోని భూగర్భ మెట్రో రైల్లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని యూకే విూడియా వర్గాలు వెల్లడించాయి. పేలుడు కారణంగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వెస్ట్‌ లండన్‌లోని పర్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌ సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా స్టేషన్‌ను మూసేసినట్లుఅధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పేలుడుపై విచారణ చేపడుతున్నారు.ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు మెట్రోపాలిటిన్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఓ తెలుపు రంగు బకెట్‌లో పేలుడు సంభవించి దాని నుంచి మంటలు వస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది, ఒక బకెట్‌లో మంటలు చెలరేగడం గమనించానని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ప్రజలందరూ భయబ్రాంతులకు గురై బిగ్గరగా కేకలు వేస్తూ ఏడుస్తున్నారు, ఆ ప్రాంతమంతా రక్తపు మరకలు ఉన్నాయని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.ఈ ఘటనపై బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిస్సా మే ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోబ్రా ఎమర్జెన్సీ కమిటీతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఉగ్రదాడులతో వణుకుతున్న బ్రిటన్‌

బ్రిటన్‌ ఈ ఏడాది వరుస ఉగ్రదాడులతో వణికిపోతోంది. నెలల వ్యవధిలోనే ఉగ్రవాదులు అనేకసార్లు మారణ¬మం సృష్టించారు. మార్చి నెలలో పార్లమెంటు సవిూపంలో కారు బీభత్సం సృష్టించిన కొద్దిసేపటితో ఓ వ్యక్తి కత్తితో ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం మే నెలలో మాంచెస్టర్‌లోని రాక్‌ కన్సర్ట్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిని మరువకముందే జూన్‌ నెలలో లండన్‌ బ్రిడ్జిపై ఆగంతకుడు వ్యాన్‌తో పాదచారులపైకి దూసుకెళ్లి ప్రజల ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే కత్తితో మరో ఉగ్రవాది అక్కడ ఉన్న రెస్టారెంట్‌లోకి వెళ్లి బీభత్సం సృష్టించాడు.